రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కొన్ని సందర్భాల్లో మనం చేసే విమర్శ నిజం కాదు అని తెలిసినప్పటికీ.. ఎదుటివారిని ఏదో ఒకటి అనాలి కాబట్టి నోటికి వచ్చింది వాగడం ఈ మధ్య ప్రతిపక్ష నేతలకు అలవాటుగా మారింది. ముఖ్యంగా తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న భయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసు స్కాంలో అడ్డంగా బుక్కవ్వడం, ఏసీబీ దూకుడు పెంచడంతో ఆయనలో ఫ్రస్టేషన్ తారాస్థాయికి చేరింది. దానికి తోడు లగచర్లలో వేసిన స్కెచ్ బెడిసికొట్టడంతో ఆయా గ్రామాల రైతులు బీఆర్ఎస్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో అరిగి పోయిన గ్రామ్ ఫోన్ రికార్డును బయటకు తీశాడు. సీఎం రేవంత్ రెడ్డిపై అవాకులు చెవాకులు పేలాడు.
మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గుజరాత్ లోని కెవాడియాలో పటేల్ విగ్రహం తరహాలో పర్యాటక అభివృద్దికోసం కృషి చేయడమనేది ఆయన ఉద్దేశం. కానీ సగం సగం వినే కేటీఆర్..వాటికి వక్రభాష్యం చెప్పారు. గాంధీ విగ్రహం వద్దు అని, ఆ డబ్బులతో పేదలకు సాయం చేయండి అని సూక్తులు వళ్లించారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని గాడ్సేతో పోలుస్తూ ప్రాసల కోసం పంచ్ లు వేస్తూ మురిసిపోయాడు.
అయితే కేటీఆర్ వ్యాఖ్యలు విన్న ఆయన రహస్య మిత్రులు మాత్రం ఆగ్రహంగా ఉన్నారట. మొన్నటికి మొన్న ఫార్ములా ఈ కార్ రేసు కుంభకోణంలో తనను అరెస్టు చేయకుండా కాపాడండి మహాప్రభో అంటూ ఆర్ఎస్ఎస్ నేతల ఇళ్ల చుట్టు ప్రదక్షిణలు చేసిన సంగతి మర్చిపోయారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఆర్ఎస్ఎస్ నేతలతో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతూ రివర్స్ లో ఆరోపణలు చేయడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.