తెలంగాణలో ఎన్నికలకు అధికార బీఆర్ఎస్ ముందుగానే రెడీ అవుతోంది. అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయిన బీఆర్ఎస్ ఈమేరకు కసరత్తును ముమ్మరం చేసింది. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం ప్రగతి భవన్ లో ఈ ఇద్దరు నేతలు ఐదారు గంటలపాటు సమావేశమై సిట్టింగ్ ఎమ్మెల్యేల బలబలాలు, సర్వే రిపోర్ట్లపై చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సర్వేల రిపోర్టింగ్ ను పరిశీలించిన కేటీఆర్ , హరీష్ రావులు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల బలాబలాలను పరిశీలించారు. ఏ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది..? ఎవరిని తప్పించాలి..? వాళ్ళ స్థానంలో ఎవరిని చేర్చాలి..? ప్రత్యామ్నాయ నేతలు ఎవరున్నారు..? అనే అంశాలపై చర్చించారు. ఎలాంటి పోటీ లేని, నేతల మధ్య సమన్వయము కుదిరిన చోట అభ్యర్థుల జాబితాను కేటీఆర్ , హరీష్ రావులు ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం.
వీటిపై గురువారం మరోసారి సమావేశమై తుది జాబితాను రెడీ చేయాలనుకున్నారు. కానీ భారీ వర్షాల కారణంగా ఈ ఇద్దరు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సి వచ్చింది. దాంతో ఈ సమావేశం వాయిదా పడింది. సోమవారం ఈ ఎపిసోడ్ పై చర్చించి మొదటి జాబితాలో ఎవరెవరిని ఉంచాలో ఖరారు చేసి జాబితాను కేసీఆర్ కు సమర్పించనున్నారు. అనంతరం కేసీఆర్ మంచి ముహూర్తం చూసుకొని మొదటి జాబితాలోని అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఆగస్ట్ మొదటి వారంలో మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అసెంబ్లీ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అప్పుడే మొదటి దశ అభ్యర్థులను ప్రకటిస్తే సిట్టింగ్ లను కాదని ప్రత్యామ్నాయ నేతకు అవకాశమిస్తే ఆందోళన చేస్తారని.. ఇది పార్టీకి మంచిది కాదని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకే ఆగస్ట్ 17తరువాత నిజ శ్రావణంలో అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.