” ఓ లంగసోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తారా.. సోషల్ మీడియా కాదు.. అది క్షుద్రవిద్య” ఇవీ.. కొన్నాళ్ల క్రితం ఆన్ లైన్ లో అబద్ధపు ప్రచారాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తీవ్రవ్యాఖ్యలు. అప్పుడు విపక్షాలు తనపై సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలను తట్టుకోలేక కేసీఆర్ ఇలా తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. అయితే ఇప్పుడు ఆయనే ఆ క్షుద్రవిద్యను నేర్చుకుంటున్నారు. ప్రత్యర్థులపై సోషల్ మీడియాలో అర్థం, పర్థంలేని పోస్టులను , అడ్డగోలు రాతలను ప్రోత్సహిస్తున్నారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఈసారి ఓడించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. అటు తాను చేసిన సేవా కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని సీతక్క నమ్మకంతో ఉంది. సీతక్కను ములుగులో ఓడించడం అక్కడ సులభతరమైన విషయం కాదు. ఆర్థిక వనరులున్న నేతలు చాలామంది బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. సీతక్కను ఓడగొడుతాం అవకాశం ఇవ్వాలని కేసీఆర్ , కేటీఆర్ లను రిక్వెస్ట్ చేశారు. కానీ సీతక్కను ఓడించేందుకు ఇలాంటి అర్హతలు ఏమాత్రం సరిపోవు అని కేసీఆర్ కు బాగా తెలుసు. ముళ్ళును ముల్లుతోనే తీయాలనే నానుడిని పక్కాగా ఫాలో అయ్యే కేసీఆర్…సీతక్కను ఓడించాలంటే సీతక్క తరహ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేతను బరిలో నిలపాలనుకున్నారు. అదే చేశారు కూడా.
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రస్తుత జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతిని ఎంపిక చేశారు. నాగజ్యోతి తల్లిదండ్రులు మావోయిస్ట్ పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో సీతక్క కూడా మావోయిస్ట్ పార్టీలో పని చేసిన అనుభవం ఉంది. మావోయిస్ట్ పార్టీ నేతలైన బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకరన్న, బడే రాజేశ్వరి అలియాస్ నిర్మలక్కల కూతురే ఈ నాగ జ్యోతి. నాగజ్యోతిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ఆమె బ్యాక్ గ్రౌండ్ తోపాటు ఆమె కూడా సీతక్కలానే ఆదివాసీ ప్రజలతో కలిసిపోతారనే పేరుంది. ఇంకేముందు ఈ అర్హతలే సీతక్కను ఓడించేందుకు తోడ్పాడుతాయని కేసీఆర్ భావించారు. అభ్యర్థిగా ఫైనల్ చేశారు.
సీతక్క ములుగు నియోజకవర్గ ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. కరోనా సమయంలో, ఇటీవలి వరదల సమయంలోనూ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అక్కడి ప్రజలని ఆకట్టుకున్నాయి. కరోనా సమయంలో సీతక్క వేటికి వెరవక గూడెం ప్రజలకు కూరగాయలు, ఆహార వస్తువులను సమకూర్చి ఎంతోమంది ఆకలి తీర్చిన అమ్మలా నిలిచింది. ఈ సమయంలోనే ఆమెకు వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగింది. అప్పట్లోనే దీనిపై కేటీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీరు ఎలాగూ చేయరు..చేసేవాళ్ళని కూడా ఇలా హేళన చేస్తారా..? అంటూ నాడు సోషల్ మీడియా టీమ్ హెడ్ గా వ్యవహరించిన క్రిశాంక్ కు కేటీఆర్ గడ్డి పెట్టారు. ఆ తరువాత బీఆర్ఎస్ సోషల్ మీడియాలో సీతక్కపై విమర్శలు రాలేదు. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి కేటీఆర్ కూడా ఏమనరు అనుకున్నారో మరెంటో కానీ మళ్ళీ సీతక్కను టార్గెట్ చేశారు క్రిశాంక్. తనకు తానుగా గిరిజనులకు పేటెంట్ అనుకుంటారని సీతక్కపై సోషల్ మీడియాలో పిచ్చి రాతలతో పోస్ట్ చేశారు. దొంగ ఫోటో షూట్ లతో ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తూ… కావాలని అభివృద్ధి చేయకుండా నియోజకవర్గానికి గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ప్రజల్లో సానుభూతి పొందాలని చూస్తున్న ఎమ్మెల్యేను చిత్తుగా ఓడించి ములుగుకు మళ్ళీ మంచి రోజులు తేవాలని కోరుకుందామంటూ బడే నాగజ్యోతికి మద్దతుగా ఈ పోస్ట్ చేశారు.
బడే నాగజ్యోతికి సపోర్ట్ చేయడం సరైనదే కానీ.. సీతక్క ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తేనే బీఆర్ఎస్ గెలుస్తుందని క్రిషాంక్ భ్రమలో ఉన్నారు. అభివృద్ధి, బడే నాగజ్యోతి సాధారణతత్త్వం గురించి చెప్పాల్సిన క్రిషాంక్ సీతక్కపై బురదజల్లితే బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారని భావించడం అవివేకం. ఓ కార్పోరేషన్ కు చైర్మన్ గా కొనసాగుతున్న క్రిషాంక్ ఇలాంటి రాజకీయపరమైన అంశాల్లో మేధావిలా ఆలోచించాలి. అంతే కానీ చిల్లర విమర్శలు చేసి పరువును కోల్పోవద్దు. ఏదీ ఏమైనా అక్కడి ఇద్దరు సామాన్యులు తలపడుతున్నారు. ఇద్దరికీ ఆల్ ది బెస్ట్…