నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. ఆనం రాంనారాయణ రెడ్డితోపాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు. టీడీపీలోకి వెళ్ళాలనే నిర్ణయించుకొని వారు పార్టీపై విమర్శలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఏబీఎన్ ఎండి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. అవసరమైతే బీఆర్ఎస్ లో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్ష నేతగా జగన్ కొనసాగిన సమయంలో నెల్లూరు జిల్లాలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరించారు శ్రీధర్ రెడ్డి. జగన్ సీఎం అయ్యాక తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డిలకు మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. రెండో దఫా మంత్రివర్గ విస్తరణలోనైనా తనకు అవకాశం వస్తుందని శ్రీధర్ రెడ్డి ఆశ పడ్డారు. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. జగన్ కు మద్దతుగా ఉంటున్నా తనను దూరం పెట్టడంతో ఆయన అసంతృప్తికి లోనయ్యారు.
ఆ మధ్య అమరావతి రైతులు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్ గా వైసీపీ నేతలు మూడు రాజధానుల ఉద్యమం చేపట్టారు. అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరుకు చేరుకోగా.. ఆ సమయంలో శ్రీధర్ రెడ్డి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇది జగన్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటి నుంచి శ్రీధర్ రెడ్డిని పూర్తిగా జగన్ దూరం పెడుతూ వచ్చారు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆహ్వానించడం లేదు. అన్నింటిని జగన్ కు వివరించేందుకు ప్రయత్నం చేసినా జగన్ అపాయింట్ మెంట్ లభ్యం కాలేదు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో శ్రీధర్ రెడ్డి కూడా ఆయన్ను అనుసరించాడు.
తన ఫోన్ ట్యాప్ చేస్తునారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పారు. వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో మీరు టీడీపీలో చేరుతున్నారట.? నిజమేనా అని ప్రశ్నించారు రాధాకృష్ణ. అందుకు ఆయన సమాధానం ఇస్తూ…మాది కుప్పం.. టీడీపీ పార్టీలో చేరితే తప్పేంటి? అని శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఏపీలో ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వని పక్షంలో తాను బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సిద్ధమే అని శ్రీధర్ రెడ్డి ప్రకటించారు.