తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచేందుకు సీనియర్లు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. రేవంత్ పీసీసీ పదవిని ఊడపీకితేగాని సీనియర్ల మనస్సు చల్లారేలా లేదు. అందుకోసం సీనియర్ నేతలు జట్టుగా ఏర్పడ్డారు. వీరికి దామోదర రాజనర్సింహ నాయకత్వం వహిస్తున్నట్లు కనిపిస్తున్నా తెర వెనక మరో సీనియర్ నేత ఉన్నట్టు అనుమానం వ్యక్తం అవుతోంది.
టీపీసీసీ జంబో కమిటీ నియామకంపై అసంతృప్తిని సీనియర్లు మొదట బాహాటంగా వెళ్ళగక్కలేదు. రేవంత్ తో కూర్చొని మాట్లాదామనే ధోరణిలో కనిపించారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో భేటీ అయిన మరుసటి రోజే, సీనియర్లు పార్టీ ధిక్కారణ చర్యలకు పాల్పడటం ఆసక్తికరంగా మారింది. మోడీతో వెంకట్ రెడ్డి ఏం చర్చించారో క్లారిటీ లేదు కాని, ఎన్నికలు నెల రోజులు ఉన్నాయనంగా ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెబుతానని ఆయన ప్రకటించారు. ఆ తరువాత సీనియర్లు భట్టి నివాసంలో సమావేశమై రేవంత్ టార్గెట్ గా విమర్శలు చేశారు. దాంతో సీనియర్ల అసంతృప్తి రాగాల వెనక కోమటిరెడ్డి ఉన్నారన్న అనుమానాలు బలపడుతున్నాయి. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్దపడే నేతలు ఈ ప్రకటనలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
పీసీసీ అద్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు దక్కాల్సిన పోస్ట్ రేవంత్ కు దక్కిందని ఆగ్రహంగా ఉన్నారు. పలుమార్లు రేవంత్ నాయకత్వంపై వ్యతిరేక ప్రకటనలు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ పార్టీ అభ్యర్థిని ఓడిస్తే రేవంత్ లీడర్ షిప్ ను చులకన చెయోచ్చుననే ఎజెండాతో పని చేశారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇదిలా ఉండగా.. సీనియర్ల సమావేశానికి వెంకట్ రెడ్డి గైర్హాజరైనా , ఆయనకు అసంతృప్త నేతలు ఫోన్ చేసినట్టు తేలడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
శనివారం భేటీ అయిన సీనియర్ నేతలను తనతోపాటు బీజేపీలోకి తీసుకెళ్లేందుకగాను, ఈ సమావేశానికి తెరచాటుగా కోమటిరెడ్డి రెడ్డి నేతృత్వం వహించి ఉండొచ్చునన్న ఆరోపణలు వస్తున్నాయి.