ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి భేటీ అయ్యారు. 20నిమిషాలపాటు వీరి సమావేశం కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతోన్న వరుస పరిణామాల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానితో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని కేవలం పెండింగ్ పనులు, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే మోడీని కలిసినట్లు వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రధాని బిజీ, బిజీగా ఉంటారు. సొంత పార్టీ ఎంపీలకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం కష్టం. అలాంటిది ప్రత్యర్ధి పార్టీ నేత వెంకట్ రెడ్డికి అడగ్గానే అపాయింట్ మెంట్ ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.
ప్రధానితో భేటీ ముగిసాక మీడియాతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఘట్కేసర్ నుంచి యాదగిరిగుట్టకు సమీపంలోని రాయగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు తెలంగాణ సీఎం కేసీఆర్ రూ.120 కోట్ల నిధులు కేటాయించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి తెలిపారు. ఈ విషయమై ప్రధానితో చర్చించినట్లు చెప్పారు.
గత వారం రంగారెడ్డి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. ఈ అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేసీఆర్ మనసొప్పడం లేదు. కానీ తాను మాత్రం నియోజకవర్గంలో పర్యటించి నష్టపోయిన రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు.
తాను ప్రధాని మోదీతో చర్చించిన ప్రతి విషయాన్ని తాను వెల్లడించలేనని కోమటిరెడ్డి చెప్పడం అనేక సందేహాలకు కారణం అవుతోంది. అయితే తన మొదటి ప్రాధాన్యత తన లోక్ సభ నియోజకవర్గం… తనకు ఓటు వేసిన ప్రజలేనని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం కేంద్రం నిధులు కేటాయిస్తే పార్టీ మారేందుకు వెంకట్ రెడ్డి రెడీగా ఉన్నారా అనే చర్చ మొదలైంది. కోమటిరెడ్డి పార్టీ మారడం లేదని కొట్టిపారేసినా.. ఏం చర్చించామన్నది బయటపెట్టకపోవడంతో మరోసారి ఆయన బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది.
Also Read : బీజేపీకి మరో షాక్ – బీజేపీని వీడనున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి..?