భారత్ జోడో యాత్ర లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రాష్ట్రాల్లో హత్ సే హత్ జోడో యాత్రలు చేపట్టాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలంతా తమ, తమ నియోజకవర్గాల్లో ఈ యాత్ర నిర్వహించాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు ఈ యాత్ర చేయాలా.?వద్దా.? అనే డైలమాలో ఉన్నారు సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి…కాంగ్రెస్ లో లేరనుకున్నారు. కొన్నాళ్ళుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేకపోయారంటే కోమటిరెడ్డి కాంగ్రెస్ లో ఉన్నట్టు ఎలా అనుకోవాలి..?అనేది పార్టీ శ్రేణుల ప్రశ్న. కొత్త ఇంచార్జ్ మాణిక్ రావు థాకరే వచ్చాక తాను కాంగ్రెస్ లోనే ఉన్నానని వెంకట్ రెడ్డి ప్రకటించారు. రేవంత్ పీసీసీ అయిన మొదట్లో పీసీసీ పోస్ట్ దక్కలేదనే అసంతృప్తితో ఇక గాంధీ భవన్ మెట్లను ఎక్కనని శపథం చేసిన కోమటిరెడ్డి ఇటీవల గాంధీ భవన్ కు వెళ్ళారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రేవంత్ తో సమావేశమయ్యారు.
రేవంత్ – వెంకట్ రెడ్డిలు కలిసిపోయారు. ఇక కాంగ్రెస్ దూకుడు పెంచుతుందని అనుకున్నారు. అంతలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న భువనగిరి పార్లమెంట్ పరిధిలో పోస్టర్లు వెలిశాయి. కోమటిరెడ్డి కోవర్ట్ రెడ్డి అని ఆ పోస్టర్ల సారాంశం. ఈ పోస్టర్ల వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కోమటిరెడ్డి అనుమానించి మళ్ళీ సైలెంట్ అయ్యారు. పాదయాత్రలు చేయాలనీ హైకమాండ్ ఆదేశించిన అందుకే ఆయన యాత్ర ప్రారంభించకుండా అలాగే ఉండిపోయారు.
ఏఐసీసీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరెవరు పాదయాత్రలు చేయడం లేదో హైకమాండ్ కు నివేదిక వెళ్ళింది. ఈ విషయం బయటకు రావడంతో కోమటిరెడ్డి కూడా హడావిడిగా బయటకొచ్చారు. తాను రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ , ఖమ్మం జిల్లాలో యాత్ర చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అయితే.. సమయం తక్కువ ఉండటంతో బస్సు యాత్ర..?బైక్ యాత్ర చేయాలా అనే విషయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. యాత్రలో ఎవరిని విమర్శించబోనని తెలిపారు.