తెలంగాణ బీజేపీ అద్యక్షుడిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందర్నీ అవాకయ్యేలా చేశాయి. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకార సభలో తాజా మాజీ అద్యక్షుడు బండి సంజయ్ జపం చేశారు. ఆయన నాయకత్వంలోనే పార్టీ బలపడిందన్న రాజగోపాల్ రెడ్డి జీహెచ్ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు బండి సారధ్యంలోనే గెలిచామని వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ ను చూస్తుంటే తన కళ్ళలో నీళ్ళు తిరిగాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బండి సంజయ్ పై అమితమైన ప్రేమను కనబరిచారు. ఇదే అక్కడున్న బీజేపీ నేతలను ఆశ్చర్యపరిచింది. అద్యక్షుడిగా బండిని మార్చాలని ఢిల్లీ పెద్దలను కలిసి తన అభ్యంతరాలను అధిష్టానంకు వివరించిన రాజగోపాల్ రెడ్డి తాజాగా జరిగిన సభలో మాత్రం బండిని ఆకాశానికి ఎత్తేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది.
పార్టీ మార్పుపై కూడా ఇదే వేదికపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టతనిచ్చారు. తాను పార్టీ మారనని.. బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేసీఆర్ ను గద్దె దించేందుకే బీజేపీలో చేరానని లక్ష్యం చేరకుండా జారిపోనని తేల్చి చెప్పారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రానున్న ఎన్నికల్లో సమిష్టిగా పనిచేస్తామని అన్నారు.