వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ ను వెనకేసుకోచ్చే ప్రయత్నంలో మాజీమంత్రి కొడాలి నాని కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివేకా వైఎస్ జగన్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా వ్యవహరించారు కాబట్టి ఆయనకు ఏం జరిగినా తప్పు లేదనే విధంగా కొడాలి నాని వ్యాఖ్యలు ఉండటం వైఎస్ కుటుంబీకులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
వివేకా చచ్చినా.. బతికినా కడప ఎంపీ టికెట్ వైఎస్ అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చి ఉండేవారు. ఎందుకంటే.. నాడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్, పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ విజయమ్మ పోటీ చేసినప్పుడు వివేకా కాంగ్రెస్ తరుఫున పోటీ చేశారని కొడాలి నాని పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబానికి మద్దతుగా నిలవకుండా ప్రత్యర్ధులకు వివేకా సపోర్ట్ చేశారని తెలిపారు. అదే సమయంలో.. అవినాష్ రెడ్డితోపాటు ఆయన తండ్రి భాస్కర రెడ్డి మాత్రం వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ తోనే ఉన్నారని..అందుకే వివేకా బతికున్నా జగన్ టికెట్ ఇచ్చే వారు కాదని కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జగన్ కు కొడాలి నాని అత్యంత సన్నిహితుడు. ఈ కామెంట్స్ చేసే ముందే జగన్ తో భేటీ అయ్యారు. ఆ తరువాతే కొడాలి నాని ఈ కామెంట్స్ చేశారంటే.. ఈ వ్యాఖ్యల వెనక జగన్ ఉండొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలు చాలామందిని ఆశ్చర్యపర్చలేదేమో కాని వైఎస్ కుటుంబీకుల్లో మాత్రం ఓ రకమైన చీలికను తీసుకొచ్చేలా ఉన్నాయి.
గతంలో జగన్ నాశనాన్ని వివేకా కోరుకున్నారని కనుక హత్యా జరిగినా తప్పులేదని అర్థం వచ్చేలా కొడాలి నాని కామెంట్స్ చేశారు. ఈ హత్యా కేసులో అవినాష్ కి మద్దతుగా జగన్ నిలవడాన్ని నాని సమర్ధించారు. అండగా నిలిచిన వారిని వదిలేసి వ్యతిరేకంగా పావులు కదిపిన వారిని ఎలా సపోర్ట్ చేస్తారని పరోక్షంగా ప్రస్తావించారు. కొడాలి నాని ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారో కాని జగన్ ను మాత్రం వైఎస్ కుటుంబంలో దోషిగా చూపే అవకాశాలు మాత్రం ఉన్నాయి.