తెలంగాణ బీజేపీని సెట్ రైట్ చేయాలనుకుంటున్న జాతీయ అధినాయకత్వం ప్రయత్నాలు ఫలించడం లేదు. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డిని అద్యక్షుడిగా నియమించినా పార్టీ ఎదుగుదలలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఎలక్షన్ మేనేజ్ మెంట్ చైర్మన్ గా కొనసాగుతున్న ఈటల , బీజేపీ అద్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య వర్గపోరు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన కృష్ణాయాదవ్ ను బీజేపీలో చేరే దిశగా పావులు కదిపి ఈటల సక్సెస్ అయ్యారు. కానీ ఆయన చేరిక చివరినిమిషంలో ఆగిపోయింది. కారణం కిషన్ రెడ్డి వ్యతిరేకించడం. ఎందుకంటే అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డి..తనకు తెలియకుండా నా ఇలాకాలో చేరికలను ఎలా ప్రోత్సహిస్తారు..? అని కృష్ణాయాదవ్ చేరికను వ్యతిరేకించినట్లు సమాచారం. దీన్ని ఈటల అవమానంగా ఫీల్ అవుతున్నారు. పార్టీ బలోపేతం కోసం చేరికలను స్పీడప్ చేస్తుంటే కిషన్ రెడ్డి మాత్రం అడ్డుకుంటున్నారని ఆయన మధనపడుతున్నారని అంటున్నారు.
మరోవైపు.. ఈటలకు చెక్ పెట్టే దిశగా కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.బీజేపీలో ఈటలతో పాటు చేరిన తుల ఉమ వేములవాడ నుంచి పోటీ చేసందుకు ఆసక్తిగా ఉన్నారు. కానీ అక్కడి నుంచి చెన్నమనేని విద్యాసాగర్ కుమారుడును కిషన్ రెడ్డి బీజేపీలో చేర్చుకున్నారు. ఈటల వర్గానికి చెక్ పెట్టేందుకే కిషన్ రెడ్డి పట్టుబట్టి మరి చెన్నమనేని వికాస్ ను బీజేపీలో చేర్చుకున్నారని అంటున్నారు.
పార్టీలో వికాస్ చేరికపై అటు ఈటలతో కానీ, తుల ఉమాతో కానీ కిషన్ రెడ్డి చర్చించలేదని తెలుస్తోంది. దీంతో కిషన్ రెడ్డి సైతం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫీల్ అవుతున్నారట ఈటల. అద్యక్ష మార్పుతో అంత సద్దుమనుగుతుందని భావిస్తే మరోసారి వర్గపోరు షురూ అయిందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Also Read : బీఆర్ఎస్ లో బయటపడుతున్న కుమ్ములాటలు – కేటీఆర్ V/s హరీష్ రావు..?