దేశంలో అంబేడ్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్న ఏకైక నాయకుడు కేజ్రీవాల్ మాత్రమేనని ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ ఇండియా ఇంచార్జి సోమ్ నాథ్ భార్తి అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజా సంక్షేమం, సుపరిపాలన అందించడం కోసం విప్లవాత్మక విధానాలకు కేజ్రివాల్ రూపకల్పన చేస్తున్నారని అన్నారు.
ఆప్ తెలంగాణ ఆధ్వర్యంలో తలపెట్టిన పాదయాత్రకు ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. అంతకుముందు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర ద్వారా కేజ్రీవాల్ తీసుకొస్తున్న విప్లవాత్మక విధానాలను గడప గడపకూ తీసుకువెళ్తామన్నారు. అవినీతి రూపుమాపడంతోపాటు, తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను నెరవేరుస్తామని అన్నారు. తెలంగాణలో రాజకీయ ప్రక్షాళన జరగాలంటే ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ హక్కున చేర్చుకోవాలని కోరారు. మొదటి రోజు ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం దగ్గరి నుంచి మొదలైన పాదయాత్ర గాంధీనగర్ న్యూ అంబేద్కర్ కాలనీ వరకు, దాదాపు 8.2 కి.మీ. కొనసాగినట్టు ఆప్ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరాశోభన్ చెప్పారు.
ఆప్ తెలంగాణ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. రాష్టంలోని ప్రతి మూలకు వెళ్లే వరకు పాదయాత్ర నిరంతరం కొనసాగుతుందని ఆప్ నేత ఇందిరాశోభన్ తెలిపారు. మొదటి రోజు పాదయాత్రలో పార్టీ నాయకులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.