టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి “యాత్ర”తో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటా హుటినా ప్రకటించారు. ములుగు నుంచి యాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి పోడు భూముల ఇష్యూనే ప్రధానంగా ప్రస్తావించారు. 2018 ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందనీ, నాలుగేళ్ళు అవుతున్నా కేసీఆర్ హామీని నెరవేర్చలేదని రేవంత్ గుర్తు చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలోనూ పోడు భూములపై గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు నటించారని ఇప్పటివరకు మళ్ళీ ఆ ఊసే లేదని రేవంత్ ప్రతి ప్రసంగంలో చెప్తూ ఈ ఇష్యూను హైలెట్ చేశారు.
పోడు భూములకు పట్టాలను బీఆర్ఎస్ సర్కార్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఇస్తుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో పది నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనీ … పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలివ్వాలనే ఫైల్ మీద మొదటి సంతకం చేస్తుందని ప్రకటించారు. రేవంత్ ప్రకటన ఆదివాసీ, గిరిజనులకు భరోసానిచ్చింది. ఇన్నాళ్ళుగా పోడు భూముల సమస్యను రాజకీయంగా ఉపయోగించుకున్న కేసీఆర్.. ఇప్పుడు రేవంత్ ప్రకటనతో పోడు రైతులకు పట్టాలిస్తామని చెప్పక తప్పని పరిస్థితి నెలకొంది.
రేవంత్ యాత్రపై ఇంటలిజెన్స్ నివేదికను తెప్పించుకున్నారు కేసీఆర్. పోడు భూములపై రేవంత్ ఇటీవలి ప్రకటన గిరిజనులు, ఆదివాసీలకు భరోసానిచ్చిందని నిఘా వర్గాలు గురువారం కేసీఆర్ కు నివేదికను సమర్పించాయి. పోడు భూములపై ఇచ్చిన హామీని నెరవెర్చకపోతే తిప్పలు తప్పవని వివరించారు. రాబోయే ప్రమాదాన్ని ముందే అంచనా వేసి… ముందస్తు చర్యలు తీసుకునే కేసీఆర్… శుక్రవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. పోడు రైతులకు ఫిబ్రవరి నెలఖారు వరకు పట్టాలు ఇస్తామని చెప్పారు.
అటు అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేయగానే ఆదివాసీ, గిరిజన తండాల్లో కేసీఆర్ చిత్రపటాలకు బదులుగా రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేవంత్ యాత్ర ద్వారానే అసెంబ్లీలో కేసీఆర్ తమకు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకొచ్చారు.