తెలంగాణ రాజకీయాలను గత కొన్ని రోజులుగా పేపర్ లీక్ వ్యవహారం కుదిపేస్తోంది. ముఖ్యంగా టీఎస్ పీస్సీ పేపర్ల లీకుల వ్యవహారంతో ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. పైగా ఈ వ్యవహారంలో నేరుగా కేటీఆర్, కవితల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ వైపు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంటే… మరోవైపు పదో తరగతి ప్రశ్నాపత్రాలు కూడా లీక్ కావడంతో ప్రభుత్వం పరిస్థితి పెనం మీది నుంచి పోయ్యిలోకి పడినట్టయింది. ప్రజలు, మీడియా, ప్రతిపక్షాలు ఇలా.. అందరి నుంచి ముప్పేటా దాడి మొదలు కావడంతో ఏం చేయాలో పాలుపోక తలపట్టుకుంది.
సరిగ్గా ఇదే సమయంలో హిందీ పేపర్ లీక్ తో బండి సంజయ్ కు సంబంధముందని పోలీసులు తేల్చడంతో.. ఇక సర్కార్ రూట్ మార్చింది. ఆ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారాన్ని మరిపించేలా చేసింది. ఇక దొరికిందే ఛాన్స్ అని.. బండి సంజయ్ ను జైలుకు పంపింది. ఈ వ్యవహారమంతా చూసినవారు ఇప్పట్లో బండి సంజయ్ జైలు నుంచి బయటకు రాడేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక్క రోజులోనే ఆయనకు బెయిల్ దక్కడం, విడుదల కావడంతో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఏదో గూడూపుఠాణీ జరిగిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
బండి సంజయ్ అరెస్ట్ తర్వాత.. ప్రభుత్వ పెద్దలు, ప్రెస్ మీట్లో పోలీసుల వాదనలని విన్నవారందరికీ బండి సంజయ్ నిజంగానే తప్పుచేశాడనన్న భావన కలిగింది. ఇక ఆయన చాప్టర్ క్లోజే అన్నంతగా విశ్లేషణలు వినిపించాయి. కానీ కట్ చేస్తే.. కోర్టులో సర్కార్ తరుఫు న్యాయవాదులు బలహీనమైన వాదనలు వినిపించినట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్, బండి సంజయ్ ఫోన్ సంభాషణలు పేపర్ లీక్ కోసమే అని మీడియా ముందు బల్లగుద్ది చెప్పిన ప్రభుత్వం పెద్దలు,.. కోర్టులో మాత్రం అది పేపర్ లీక్ కుట్రలో భాగమని బలంగా వాదించలేకపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే బండి సంజయ్ బెయిల్ వచ్చిందని చెప్పుకుంటున్నారు.
అయితే కోర్టులో సర్కార్ సరైన వాదనలు వినిపించడంలో వైఫల్యం చెందటానికి కేసీఆర్ లోని భయమే కారణమై ఉండొచ్చరని విశ్లేషకులు అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారనే భయంతోనే బండి సంజయ్ విషయంలో కేసీఆర్ చివరి నిమిషంలో కాస్త మెతక వైఖరి అవలంభించారని విశ్లేషిస్తారు. పైగా బండి బెయిల్ పై విచారణ జరుగుతున్న సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఈడీ అదనపు ఛార్జీషీట్ వేయడంతో.. ముప్పును గ్రహించి.. సర్కార్ తరుపున న్యాయవాదులు బలహీనమైన వాదనలు వినిపించి సంజయ్ కు బెయిల్ రావడానికి పరోక్ష సహకారం అందించ్చి ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు.
Also Read : బండి సంజయ్ అరెస్ట్ ఓ డ్రామా- బెయిల్ మంజూరుకు సర్కార్ లైన్ క్లియర్..?