రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతుందని ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చించడం ద్వారా కేంద్రం వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం డిసెంబర్ మొదటివారంలో వారంరోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. నవంబర్ లో ఇందుకు సంబంధించిన ప్రకటనను సీఎంవో చేసింది. కాని అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సర్కార్ నుంచి ఇంతవరకు క్లారిటీ లేదు.
కేంద్రం వల్ల తెలంగాణకు 40వేల కోట్ల ఆదాయం నష్టం జరిగిందని.. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరితో తెలంగాణ ప్రగతి క్షిణిస్తోందని , దీనిపై చర్చించాలని డిసెంబర్ నెలలో వారం రోజులపాటు ఉభయ సభలను నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే, ఈ మధ్యలోనే బీఆర్ఎస్ ఆవిర్భావం, కవితకు సీబీఐ నోటిసులు రావడంతో కేసీఆర్ బిజీ అయిపోయారు. దీంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కసరత్తు అలాగే నిలిచిపోయింది.
క్రిస్మస్ పండగ సమీపిస్తుండటంతో ఈ నెలలో అసలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారా..? లేదా అన్న మీమాంస కూడా నెలకొంది. కాగా, అసెంబ్లీ సమావేశాలు పక్కాగా ఉంటాయని, వారం రోజులు సాధ్యం కాకపోయినా కనీసం మూడు రోజులైనా సభ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. క్రిస్మస్ కంటే ముందుగానే ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.
మంగళవారం నుంచి గురువారం వరకు సభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.