పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలతో బీఆర్ఎస్ విలువైన సమయాన్ని కోల్పోయిందని నిట్టూరుస్తోంది. పార్లమెంట్ స్పెషల్ సెషన్ ఎజెండా ఏంటో అంచనా వేయకుండా 20 రోజులపాటు ఎన్నికల ప్రచారాన్ని బంద్ పెట్టారు. జమిలి ఎన్నికలు వస్తేయేమోననే అంచనా వేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ప్రచారాన్ని ప్రారంభించవద్దని అభ్యర్థులకు ప్రగతి భవన్ నుంచి కబురు వెళ్ళింది. తీరా కేంద్రం జమిలి ఎన్నికల ఊసే ఎత్తకపోవడంతో బీఆర్ఎస్ ఉసురుమనింది. 20రోజుల విలువైన సమయం వృధా అయిందని పార్టీ నేతలే విసుక్కుంటున్నారు.
కేంద్రం వ్యూహాలను అంచనా వేయలేకపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్ 20రోజుల వ్యవధిలో దారుణంగా పతనం అయింది. కారణం..జమిలి ఎన్నికలు ఉంటాయేమోనని అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగం తగ్గించారు. ఈ గ్యాప్ లో కాంగ్రెస్ కార్యక్రమాలు పెరగడం.. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరగడం, సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించడం.. అవి జనాల్లోకి వెళ్ళడంతో కాంగ్రెస్ గ్రాఫ్ కాస్త పెరిగింది. ఇప్పుడు జమిలి ఎన్నికలపై స్పష్టత వచ్చినప్పటికీ పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్ బీఆర్ఎస్ ను ఆందోళనకు గురి చేస్తోంది.
కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించిన మరుసటి రోజు నుంచే ప్రచారాన్ని షురూ చేసుంటే.. కాంగ్రెస్ మరింత రేసులోకి వచ్చుండేది కాదేమో.ఈ మధ్యలో కాంగ్రెస్ యాక్టివిటీస్ పెరిగి..బీఆర్ఎస్ యాక్టివిటీస్ తగ్గడంతో తేడా వస్తుందా.? అని అధికార పార్టీ లీడర్లు గుసగుసలాడుకుంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. కాని రాజకీయ పరిణామాలను అంచనా వేయలేక సమయాన్నిసరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోకి దూకినా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ తో సమానంగా కాలు దువ్వుతోంది.
మరో నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రచార పర్వం షురూ చేయనున్నారు. కాంగ్రెస్ కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని బీఆర్ఎస్ అభ్యర్థులు టెన్షన్ ఫీల్ అవుతున్నారు.
Also Read : బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – భూపాలపల్లిలో మధుసూదన చారి తనయుడు పోటీ..?