11 ఎకరాలలోపు వారికి మాత్రమే ‘రబీ’ సీజన్ కు సంబంధించి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. డిసెంబర్ మూడో వారం నుంచే ‘రబీ’ సీజన్ యొక్క రైతు బంధు డబ్బులను ఖాతాలో జమ చేసిన సర్కార్… 11 ఎకరాలు మించి ఉన్నవారికీ రైతుబంధు డబ్బులను ఇంతవరకు చెల్లించలేదు. దీంతో రైతుబంధు డబ్బులు తమ ఖాతాలో ఎందుకు జమ కాలేదని అర్హులైన రైతులు ఆందోళన చెందుతూ వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను కలిసి ఆరా తీస్తున్నారు. అదే సమయంలో రైతు బంధుపై కొత్త చర్చ తెరపైకి వచ్చింది.
రైతుబంధును ఎత్తేస్తారా..? అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. నిజానికి.. రైతుబంధు అమలుకు నిధులు సమస్య ఎదురు అవుతూ వస్తోంది. ప్రతిసారి అనుకున్న సమయానికి నిధులను విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల అంశం సర్కార్ కు తలనొప్పిగా మారగా.. రైతుబంధు అమలు ప్రభుత్వానికి చికాకు తెప్పిస్తోంది. 68 లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు అమలు చేయాలంటే అంత ఈజీ కాదు. పెద్ద మొత్తంలో నిధులు అప్పులు చేయాల్సి వస్తోంది. అందుకే రైతుబంధు రద్దు చేసి దానికి సమానంగా కొత్త పథకం ప్రవేశపెట్టాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రైతు బంధుపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ఇది భూస్వాములకు ఉపయోగపడేదే తప్పితే సన్నకారు రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని…పేద రైతులకు పెట్టుబడి సాయం కింద సర్కార్ ఇచ్చే రైతుబంధు డబ్బులు ఏమూలకు సరిపోవడం లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. వ్యవసాయం చేయకుండా పడావు పడిన భూములకు కూడా రైతుబంధు ఇస్తారా..? కేవలం వ్యవసాయం చేసే వారికీ మాత్రమే రైతుబంధు అమలు చేయాలనే డిమాండ్లు ఉన్నాయి. ఐదు లేదా పది ఎకరాల లోపు భూమి ఉన్నవారికీ మాత్రమే రైతుబంధును అమలు చేయాలని మెజార్టీ అభిప్రాయాలు వచ్చాయి. ఇప్పటివరకు అందరికీ రైతుబంధును అమలు చేస్తూ వచ్చి.. ఇప్పుడు కొంతమందికి మాత్రమే రైతుబంధును వర్తింపజేస్తే, మిగతా వారి నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందనేది సర్కార్ ఆలోచన. అందుకే తెలివిగా ఓ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ను రైతుబంధు గట్టెక్కించింది. ప్రస్తుతం ఈ పథకం సర్కార్ కు గుదిబండగా మారడంతో ఈ పథకం స్థానంలో కొత్త స్కీంను అమలు చేయాలని యోచిస్తున్నారు. అదే రైతులకు పెన్షన్ స్కీం. ఈ పథకం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేశారని..పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడమో లేదంటే, ఎన్నికలకు వెళ్ళే ముందు అమలు చేయడమో చేస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ భూమి కలిగిన పట్టా పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకూ పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతులకు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది..? ఎన్ని నిధులు కేటాయించాల్సి వస్తుంది..? ఎంత అప్పు చేయాల్సి వస్తుంది? వయస్సు పరిమితి ఏమైనా విధించాలా..? అనే అంశాలను కేసీఆర్ ఉన్నాతాధికారులతో చర్చలు జరుపుతున్నారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
రైతుబంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 68 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతులకు పెన్షన్ స్కీం అమలు చేయాలనుకుంటే వీరందరికీ పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఎవరేవరికీ ఈ పెన్షన్ స్కీంను వర్తింపజేయాలి…? ఎలాంటి గైడ్ లైన్స్ విధించాలి..? అనే అంశాలపై కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రైతు బంధు నిధులతో పోలిస్తే రైతు పెన్షన్ స్కీం ద్వారా నిధులు తక్కువ మొత్తంలోనే అవసరం అవుతాయని అంచనా వేసి.. ఈ పథకం తీసుకురావాలని యోచిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read : కేసీఆర్ ఎన్నికల అస్త్రం ఇదేనా…?