తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ కంటే ముందే జరగనున్నాయా..? ఆషాడం ముగిసిన వెంటనే మంచి ముహూర్తం చూసుకొని అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయనున్నారా..? కాంగ్రెస్ కు ఊపిరిరాడకుండా చేసేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణలో షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని బీఆర్ఎస్ నేతలంతా చెప్తూ వచ్చారు కానీ, పరిస్థితులు మారడంతో కేసీఆర్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనడుతోంది. కర్ణాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ అనూహ్య రీతిలో పుంజుకుంది. కాంగ్రెస్ బలపడుతోందని నిఘా వర్గాలు కేసీఆర్ కు నివేదించాయి. దాంతో బీఆర్ఎస్ బాస్ వ్యూహాలపై దృష్టిసారించారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్ కు మేలు చేస్తుందని… ఆలస్యం చేస్తే కాంగ్రెస్ కు ఉపయుక్తంగా ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు.
అందులో భాగంగా కేటీఆర్ గత నెల చివరి వారంలో కేంద్ర పెద్దలతో మాట్లాడి ముందస్తు ఎన్నికలపై చర్చించినట్లు స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. కేంద్రం – రాష్ట్రం మధ్య కోల్డ్ వార్ ముగియడంతో బీఆర్ఎస్ కు సహకరించేందుకు బీజేపీ అంగీకరించింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగనున్నది. కేసీఆర్ ఆషాడం ముగిసిన వెంటనే ముహూర్తం చూసి అసెంబ్లీని రద్దు చేస్తారనే వాదనలు వస్తున్నాయి. అదే గనుక జరిగితే ఆగస్టు చివరి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి ఆ తరువాత వారం రోజులకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ రెండో వారంలోపు ఎన్నిల ప్రక్రియ పూర్తి అవుతుంది.
బీఆర్ఎస్ కు బీజేపీ సహకారం వెనక వ్యూహం ఉన్నది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదని ఆ పార్టీ అధినాయకత్వానికి అర్థమైంది. ఇప్పుడు ఆ పార్టీ ఫోకస్ అంత కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడంపైనే. ఇది జరగాలంటే కాంగ్రెస్ బలపడకూడదు. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల తరువాత పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత స్ట్రాంగ్ అవుతోంది. ఇదే సమయంలో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే అందరిచూపు కాంగ్రెస్ వైపు మళ్ళుతుంది. బీజేపీ బలహీనపడిందనే వాదనలు గెలుపును ప్రభావితం చేస్తాయి. ఇది జరగకూడదు అంటే తెలంగాణలో ముందే ఎన్నికలు జరగాలి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలి. అందుకే షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన బీఆర్ఎస్ వినతి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించిందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read : రైతు బంధు రద్దు – కొత్త స్కీం అమలుకు కేసీఆర్ నిర్ణయం..?