గవర్నర్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దని తెలంగాణ సర్కార్ డిసైడ్ అయింది. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బడ్జెట్ ఫైలుకు గవర్నర్ ఆమోదం తెలపపకపోవడంతో హైకోర్టుకు వెళ్లనుంది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. బడ్జెట్ ఫైలుకు ఆమోదం తెలిపేలా గవర్నర్ ను ఆదేశించాలని కోర్టును కోరనుంది.
ఫిబ్రవరి 3వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం ఈ నెల 21వ తేదీన బడ్జెట్ ఫైలును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కాని ఆ ఫైల్ ను ఆమె పెండింగ్ లోనే పెట్టారు. వరుసగా రెండోసారి తన ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బడ్జెట్ కు ఎలా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ , కౌన్సిల్ జాయింట్ సెషన్స్ ఎందుకు నిర్వహించడం లేదంటూ ఆమె ప్రశ్నించారు.
మరో మూడు రోజుల్లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. సమయం ఎక్కువ లేదు. గవర్నర్ మాత్రం బడ్జెట్ కు ఆమోదం తెలపడం లేదు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం ఉండాలని ఆమె పట్టుబడుతున్నారు. సర్కార్ ఏమో నిరాకరిస్తోంది. దీంతో ఎం చేయాలని సమాలోచనలు జరిపిన కేసీఆర్.. బడ్జెట్ ఫైల్ ను ఆమోదించేలా గవర్నర్ ను ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరి..కోర్టు ఏ నిర్ణయం ప్రకటిస్తుందో ..