ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కేసీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో కేసీఆర్ మీడియా సమావేశం సందర్భంగా ఆధారాలను బయట పెట్టిన అంశాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ కు ఈ సాక్ష్యాలను ఎవరిచ్చారో తేల్చడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి సబ్మిట్ చేయాల్సిన ఆడియో, వీడియోలను బయట పెట్టడంపై న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు.
కేసీఆర్ మీడియా సమావేశంలోనే ఫామ్ హౌజ్ వ్యవహారానికి సంబంధించిన వీడియోలను విడుదల చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, కేసీఆర్ కు సాక్ష్యాలు ఎక్కడి నుంచి అందాయి..? ఎవరిచ్చారు..? దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన వీడియోలు కేసీఆర్ ఎందుకు బయటపెట్టారు..? అని సీబీఐ ప్రశ్నించనుంది. నలుగురు ఎమ్మెల్యేల విచారణ తరువాత కూడా విషయం నిగ్గు తేలకపోతే కేసీఆర్ ను ప్రశ్నించనుంది. అదే జరిగితే ఈ కేసు సంచలనం సృష్టించనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు సరిగ్గా జరిగినట్లు లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ.. ఈ కేసును సీబీఐకి ఇవ్వడానికి 45గల కారణాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ 455/2022 ను సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పు ఇచ్చారు.
సిట్ దర్యాప్తును హైకోర్టు రద్దు చేయడంతో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ మొదటి నుంచి దర్యాప్తు చేయనుంది. ఈ వ్యవహారానికి సంబంధించి ఫిర్యాదు చేసిన పైలెట్ రోహిత్ రెడ్డిని మరోసారి సీబీఐ విచారించనుంది. ముగ్గురు ఎమెల్యేలను కూడా విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇవ్వకుండా బయటపెట్టిన కేసీఆర్ ను కూడా సీబీఐ ప్రశ్నించనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది.