తెలంగాణలో విలువైన ప్రభుత్వ భూములపై సర్కార్ గద్దల కన్ను పడిందని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో విలువైన కొంత సర్కార్ ల్యాండ్ ను తక్కువ మొత్తానికి బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయానికి కేటాయించారు. తాజాగా ఎకరం వంద కోట్లు పలికే కోకాపేటలో బీఆర్ఎస్ కు ఏకంగా 11ఎకరాల భూమిని ధారాదత్తం చేసేశారు కేసీఆర్. ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ వ్యవహారం జరగడమే ఇపుడు సంచలనంగా మారింది.
కోకాపేటలో రూ.550కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.37.53కోట్లకే బీఆర్ఎస్ కు కట్టబెడుతూ మంత్రివర్గం తీర్మానించింది. నూతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించిన ఫైల్ క్లియర్ అయింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రులు ఈ విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బీఆర్ఎస్ కు పదకొండు ఎకరాల భూమిని కట్టబెట్టడానికి కారణం. కాలేజ్ పెడుతుందట. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెలవప్మెంట్ పెడతామని ఇందుకోసం స్థలం కావాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ నుంచి ప్రతిపాదనలు వెళ్ళాయి. ఇంకేముంది..? అధికార పార్టీ కావడంతో వెంటనే అనుమతులు వచ్చేశాయి.
కోకాపేటలో 239, 240 సర్వే నంబర్లలోని 11 ఎకరాల భూమిని హెచ్ఎండీఏ ద్వారా ఇప్పించాలని ఈ నెల 16న సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపించారు. ఆ మరుసటి రోజే సీసీఎల్ఏ ఆ ఫైల్ ను తెలంగాణ స్టేట్ డెలవప్ మెంట్ అధారిటీకి పంపింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే బీఆర్ఎస్ కు భూమి అప్పగించాలని అధారిటీ సిఫారసు చేసింది. దీంతో బీఆర్ఎస్‌కు కు అతి తక్కువ ధరకు భూమిని కట్టబెడ్తూ జీవో వచ్చింది.
లోలోపల వ్యవహారాలన్నీ పూర్తయ్యాక తర్వాత బయటకు తెలియడం చర్చనీయాంశం అవుతోంది.