నాగర్ కర్నూల్ జిల్లాలో అందరి చూపు ఆ నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. వచ్చే ఎన్నికల్లో ఆ స్థానం నుంచి అధికార పార్టీ తరుఫున ఎవరు పోటీ చేయనున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇస్తారా..? ఆయనపై పెరుగుతోన్న వ్యతిరేకత దృష్ట్యా స్థానచలనం తప్పదా? అనే విషయాలపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటనేగా మీ సందేహం.
నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఈసారి బీఆర్ఎస్ తరుఫున ఎవరు పోటీ చేస్తారు? అనే విషయమై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం అచ్చంపేట ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన గువ్వల హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. టికెట్ విషయంలో క్లారిటీ లేదు కానీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పోటీలో ఉండబోయేది తానేనని చెప్పుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళి టికెట్ లు ఇస్తానని కెసిఆర్ గతంలో మాటిచ్చారు. పోయిన ఎన్నికలలో కూడా కెసిఆర్ ఇలాగే మాట ఇచ్చారు. కానీ నాటి సిట్టింగ్ ఎమ్మెల్యే బాబు మోహన్ కు టికెట్ ఇవ్వకుండా క్రాంతి కిరణ్ కి ఇచ్చి మాట తప్పారు. ఇప్పుడు కూడా అది పునరావృతం కావచ్చు అని అందరూ భావిస్తున్నారు.
ఆందోల్ లో బాబు మోహన్ కు హ్యాండ్ ఇచ్చినట్లుగానే అచ్చంపేటలో గువ్వలకు కేసీఆర్ మొండిచేయి చూపిస్తారనే ప్రచారం సాగుతోంది. వివాదాస్పద నేతగా పేరు పొందటంతోపాటు తీవ్ర ప్రజా వ్యతిరేకతను గువ్వల మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ పర్యటించినా గువ్వలకు చేదు అనుభవం ఎదురు అవుతోంది. నిరసనకారులకు సావధానంగా సమాధానం చెప్పాల్సిన గువ్వల వారిపై గుస్సా అవుతున్నారు. దీంతో ఆయనపై వ్యతిరేకత నానాటికీ మరింత నివురుగప్పిన నిప్పులా మారుతోంది. బీఆర్ఎస్ లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో గువ్వల మొదటి స్థానంలో ఉన్నట్లు ఇటీవల కేసీఆర్ టేబుల్ మీదకు చేరిన సర్వే నివేదికలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది.
గువ్వల బాలరాజును కేసీఆర్ మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారు. ఆయన ఫర్ఫమేన్స్ పై ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ పనితీరును మెరుగుపరుచుకోవాలని చెబుతూనే ఉన్నారు. కాని ఆయన వ్యవహారశైలిలో ఏమాత్రం మార్పు లేనట్లుగా ఇటీవల సర్వే నివేదికలు తెల్చేశాయి. దాంతో ఆయనకు స్థాన చలనం తప్పదని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. నాగర్‌కర్నూల్ ఎంపీగా బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోతుగంటి రాములు ఉన్నారు. ఆయన స్థానంలో వచ్చే ఎన్నికల్లో గువ్వల బాలరాజును పార్లమెంట్ కు పోటీ చేయించాలని… అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రాములును పోటీ చేయించాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐతే అచ్చంపేట నుంచి రాములును బరిలో నిలపాలని కేసీఆర్ అనుకున్నప్పటికీ…రాములు తన కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ను అసెంబ్లీ బరిలో దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయమై కేసీఆర్ కు రాములు సమాచారం అందించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు గువ్వల బాలరాజు వ్యతిరేక పక్షమంతా భరత్ ప్రసాద్ వెంబడి నిలుస్తున్నారు. గువ్వల విధానాలను నచ్చని కొంతమంది ప్రత్యర్ధి పార్టీల నేతలు భరత్ పోటీలో ఉంటె పార్టీలకతీతంగా మద్దతు ఇస్తామని చెబుతున్నట్టు సమాచారం. అచ్చంపేటలో గువ్వలతోపాటు ఆయన అనుచరుల అరాచకం పతాక స్థాయికి చేరుకుందని.. గువ్వల అధికార అహంకారం అణచివేయాలంటే ఆయన ఓటమి కోసం భరత్ కు పార్టీలకతీతంగా సహకరిస్తామని చెబుతున్నారు.