ఈసారి ఎన్నికల్లో నెగ్గడం ఈజీ కాదని భావిస్తోన్న కేసీఆర్ కొత్త పథకంతో మ్యాజిక్ చేయాలనుకుంటున్నారా..? ఒకే ఒక్క పథకం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ గెలుపు ప్రణాళిక ఏంటి..? ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతిపక్షాలు దూకుడు పెంచగా.. బీఆర్ఎస్ అధినేత మాత్రం నిశ్చితంగా ఉండటానికి కారణమేంటి..? హ్యాట్రిక్ నమోదు చేస్తామంటున్న కేసీఆర్ అసలు ధీమా ఏంటి..? సునాయసనంగా కేసీఆర్ కు అధికారం కట్టబెట్టే ఆ మంత్రం ఏంటి..?
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ను రైతు బంధు గట్టెక్కించింది. ఈసారి దళిత బంధు విజయాన్ని చేకూరుస్తుందనుకున్నా..ఆ పథకంపై బీఆర్ఎస్ ఆశలను వదిలేసుకుంది. దీంతో కేసీఆర్ మళ్ళీ రైతులను ఆకట్టుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తునట్టుగా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. రైతులకు పెన్షన్ స్కీం ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తి చేశారని..పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టడమో లేదంటే, ఎన్నికలకు వెళ్ళే ముందు అమలు చేయడమో చేస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ భూమి కల్గి పట్టా పాస్ బుక్ కల్గిన ప్రతి రైతుకూ పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతులకు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది..? ఎన్ని నిధులు కేటాయించాల్సి వస్తుంది..? వయస్సు పరిమితి ఏమైనా విధించాలా..? అనే అంశాలను కేసీఆర్ ఉన్నాతాదికారులతో చర్చలు జరుపుతున్నారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం.
రైతు బంధు లెక్కల ప్రకారం రాష్ట్రంలో 68లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతులకు పెన్షన్ స్కీం అమలు చేయాలనుకుంటే వీరందరికీ పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని అమలు చేయాలనుకుంటే బడ్జెట్ లో నిధులు కేటాయించాల్సింది. కాని బడ్జెట్ లో ఈ స్కీం ప్రస్తావనే లేదు. దళిత బంధును పథకం కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టకుండానే అమలు చేశారు. రైతు బంధును కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు రైతులకు పెన్షన్ అనే పథకాన్ని కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టకుండానే ఎన్నికలకు ముందు అమలు చేసే అవకాశం కూడా ఉంది. లేదంటే మ్యానిఫెస్టోలో పెట్టనున్నారు.
తెలంగాణలో రైతులకు పెన్షన్ స్కీం ను ప్రవేశపెట్టడం వలన అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల్లో రైతుల ఓట్లను గంపగుత్తగా రాబట్టుకోవడమే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్తే అక్కడ కూడా లబ్ది పొందవచ్చునని అనుకుంటున్నారు.అయితే ఈ పథకాన్ని తెలంగాణలో ముందు అమలు చేస్తారా.. మేనిఫెస్టోలో పెడతారా.. అన్నది మరో వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.