పోడు భూముల సమస్యపై కేసీఆర్ మళ్ళీ మొదటికొచ్చారు. పోడు పట్టాలు ఇస్తామని అంటూనే అఖిలపక్ష సమావేశం ప్రస్తావన తీసుకొచ్చారు. నిజంగా..కేసీఆర్ కు పోడు భూములను అర్హులైన వారికీ కట్టబెట్టి పట్టాలిచ్చే యోచనే ఉంటె..అఖిలపక్ష సమావేశం ప్రస్తావన తీసుకురారు. కానీ ఆయన అదే చేశారు.
అన్ని పార్టీలు అంగీకరిస్తే పోడు భూములకు పట్టాలు ఇచ్చేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీలు ఒప్పుకున్నంత మాత్రాన పట్టాలు ఇచ్చేయోచ్చా అంటే..? ఇవ్వలేం. కాని కేసీఆర్ మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. అటవీ భూములకు పట్టాలివ్వాలంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి.
అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 2005కి ముందు నుంచి పోడు భూముల్ని సాగు చేసుకుంటున్న వారికి మాత్రమే పట్టాలివ్వాల్సి ఉంటుంది. 2005 డిసెంబర్ 13 కంటే ముందు అటవీ భూములను సాగు చేస్తున్న గిరిజనులందరికీ భూమిపై హక్కు కల్పిస్తూ పట్టాలు ఇవ్వాలి. లక్షా 60 వేల ఎకరాలు మాత్రమే హక్కులు కల్పించేందుకు అర్హత ఉంది. ఇందులో కొన్నింటిని అధికారులు తిరస్కరించారు. 2005తరువాత కొన్ని లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 2006లో అమల్లోకి వచ్చిన అటవీ చట్టం మాత్రం.. అలాంటి భూములకు హక్కులు కల్పించేందుకు అవకాశం లేదు.
2018ముందస్తు ఎన్నికల సమయంలో పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ప్రజా దర్బార్ పెట్టి పోడు సమస్యను తీర్చుతానని ప్రకటించారు. పోడు భూముల సమస్యను తీర్చిన అనంతరం ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు కూడా గురి కాకుండా చూస్తానని స్పష్టం చేశారు. కాని నాలుగేళ్ళు అవుతున్నా పోడు సమస్య పరిష్కారం కాలేదు. సరికదా.. మరింత వివాదంగా మారింది.
పోడు భూముల్లో సేద్యం చేస్తోన్న వారిపై ఫారెస్ట్ ఆఫీసర్లు లాఠీచార్జీ చేయడంతో ప్రతిగా గిరిజనులు తిరగబడటం జరిగింది. ఇదంతా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లేనని విమర్శలు వచ్చాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం అనుకుంటోంది.
తాజాగా అసెంబ్లీలోనూ కేసీఆర్ ప్రకటన చేశారు. పట్టాలిస్తామన్నారు కానీ, మందికి ఇస్తారో చెప్పలేదు. ప్రతి ఒక్కరికి లెక్క ప్రకారం భూములు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాతోపాటు…వాళ్లకు విద్యుత్ కెనెక్షన్ ఇచ్చి, రైతు బంధు కూడా ఇస్తామన్నారు. కానీ పట్టాలు తీసుకునే వాళ్లు భవిష్యత్‌లో అడవిని కాపాడే కాపాలాదారులు కావాలన్నారు. దీన్ని రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.చివర్లో అఖిల పక్ష సమావేశం ప్రస్తావన తీసుకురావడం చర్చగా మారింది.