దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని డైలాగ్ లు పేల్చే టీఆర్ఎస్ నేతలు ఓసారి ఒరిస్సా వైపు చూడాలని హితవు పలుకుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థే ఉండదని ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఒరిస్సా ప్రభుత్వం ఒక్క సంతకంతో 57వేల మందిని రెగ్యులరైజ్ చేసిందని తెలంగాణ సర్కార్ కు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఇరవై వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కాని ఇప్పటి వరకు హామీ అమలులో చెప్పుకోదగ్గ ముందడుగు పడనేలేదు. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం ఒక్క కలంపోటుతో ఏకంగా 57వేల మందిని రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసేలా మారింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడమే కాదు..ఒరిస్సాలో కాంట్రాక్ట్ విధానాన్నే రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. మెజార్టీ రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ వ్యవస్థతో ప్రభుత్వ వ్యవస్థలను కొనసాగిస్తూ ఉండగా..ఒరిస్సా సర్కార్ మాత్రం కాంట్రాక్ట్ వ్యవస్థే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆషామాషీ కాదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేయడం ద్వారా 57వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందుతారు.. ఇందుకు ప్రభుత్వానికి ఏటా రూ.1,300 కోట్లు ఖర్చవుతుందని నవీన్ పట్నాయక్ ప్రకటించారు.
ఒరిస్సా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓ ప్రతి దానికి ఓవర్ ఎక్స్ ప్రెషన్ తో తెలంగాణ వైపు దేశమంతా చూస్తుందని గొప్పలు చెప్పుకోవడం కాదు.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చిత్తశుద్ది చూపాలంటూ గడ్డి పెడుతున్నారు.