తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అకస్మాత్తుగా కొండగట్టు అంజన్న ఎందుకు గుర్తుకు వచ్చారు..? ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని నిధులు కూడా కేటాయిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేసీఆర్.. ఆ తరువాత మళ్ళీ అటువైపే వెళ్ళలేదు. నిధులు మంజూరు చేయలేదు. కానీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో కొండగట్టు అంజన్న కేసీఆర్ కు యాదికొచ్చారు. అయితే.. ఇది రాజకీయ యాత్రో, ఇంకేదో యాత్ర కాదు. పాప ప్రక్షాళన యాత్ర అనే ప్రచారం జరుగుతోంది.
కొండగట్టు అంజన్న సన్నిధి పాప ప్రక్షాళన క్షేత్రంగా ప్రతీతి. కొండగట్టుకు వెళ్తే ఎలాంటి దోషమైనా పోతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు అదే నమ్మకంతో దోషాలను, ఆరేళ్ల క్రితం కొండగట్టు వద్ద జరిగిన బస్సు ప్రమాద బాధితులను పరామర్శించకపోవడంతో చుట్టుకున్న పాపాన్ని తొలగించుకునేందుకు కేసీఆర్ అంజన్న దర్శనానికి వెళ్ళినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పాప ప్రక్షాళనలో భాగంగా ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం బాగానే ఉంది కానీ ఆరేళ్ళ తరువాత బస్సు ప్రమాద బాధితులు గుర్తుకు రావడం విమర్శలకు తావిస్తోంది.
2018 సెప్టెంబర్ 11. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంపై ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కొండ పైనుంచి బస్సు కిందకు వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 64మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్క మృతుడి కుటుంబాన్ని పరామర్శించలేదు. ఏ ఒక్కరికీ ఆర్థిక సాయం కూడా అందలేదు. కానీ అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించాడు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్ కుమారుడికి కేసీఆర్ గౌరవం ఇచ్చి ఉండొచ్చు. కానీ బస్సు ప్రమాదంలో 64మంది సామాన్యులు చనిపోతే ఎందుకు స్పందించలేదు.? ఆర్ధిక సాయం ఎందుకు ప్రకటించలేదు. ?ఆ దుఃఖం ఎందుకు రాలేదు…? ఎందుకంటే..వారంతా కేసీఆర్ దృష్టిలో ఓటర్లు మాత్రమే. వాళ్లకి గొంతు లేదు.. వాళ్ళను పట్టించుకోకపోయినా పరవాలేదనే ధోరణితో ఉన్నారు.
2004లో కొండగట్టు అంజన్న ఆలయ సమీపంలో వాటర్ ట్యాంక్ కూలీ 20మంది ప్రాణాలు విడిచారు. నాడు సీఎంగా నున్న వైఎస్సార్ వెంటనే కొండగట్టుకు వెళ్ళారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారిని ఓదార్చారు. ధైర్యం చెప్పారు. చనిపోయిన వాళ్ళను తీసుకురాలేం కానీ మీకు అండగా ఉంటామని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. అలాగే, రామడుగు మండలంలోని వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైన పిల్లలు చనిపోయిన ఘటనలో నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రమాదస్థలికి వెళ్ళారు. తల్లిదండ్రుల వలపోతను చూడలేక ఆయన ఏడ్చారు. ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. గత ముఖ్యమంత్రులంతా ఇదే విధంగా వ్యవహరించేవారు. కానీ 64 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే కేసీఆర్ కు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. బాధిత కుటుంబాలను పరామర్శించాలనే సోయి రాలేదు.
ఇప్పడు ఆ పాపం తనకు ఎక్కడ చుట్టుకుంటుందోనని కొండగట్టు అంజన్న క్షేత్రానికి పాప ప్రక్షాళన కోసం వెళ్ళాడని ప్రచారం జరుగుతోంది.