జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కేసీఆర్ ఆసక్తిగా ఉన్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే కేసీఆర్ లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు. పలు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కొంత కష్టమే. అందుకే కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ బీఆర్ఎస్ గెలిస్తే వెంటనే కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారా..? లోక్ సభ ఎన్నికల వరకు కేసీఆరే సీఎంగా కొనసాగుతారా..? అనేది క్లారిటీ రావడం లేదు.
మూడోసారి కేసీఆర్ బొమ్మతోనే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్తుంది. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని బీఆర్ఎస్ టార్గెట్ పెట్టుకుంది. సౌత్ ఇండియాలో వరుసగా మూడోసారి సీఎం అయిన ఖ్యాతి కేసీఆర్ కు సొంతం అవుతుందని కేటీఆర్ పలు సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అయినా కొన్నాళ్ళుగా కేటీఆరే పాలనపరమైన వ్యవహారాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. పార్టీ వ్యవహారాల్లో ఆయన కింగ్ మేకర్ గా కనిపిస్తున్నారు. ఆయన లేకుండా ఎలాంటి నిర్ణయాలు జరగడం లేదు. మొత్తానికి యాక్టింగ్ సీఎంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.
కేటీఆర్ ను కలిస్తే పదవులు వస్తాయని ఆ పార్టీ నేతల ఆలోచన. అందుకే పార్టీలో ఎవరైనా కేసీఆర్ కంటే ఎక్కువగా కేటీఆర్ ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ పై సందేహం ఉన్న నేతలు సైతం కేటీఆర్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే, పార్టీ సభల్లోనే కొన్ని చోట్ల వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను కూడా ప్రకటించారు కేటీఆర్. తాజాగా స్టేషన్ ఘన్ పూర్ వివాదంలో కడియం, రాజయ్యలను పిలిచి మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు.
ఇలా పార్టీ అంత కేటీఆర్ హ్యండోవర్ లోకి వెళ్ళింది. ఇదివరకు కేసీఆర్ తరువాత హరీష్ రావు కనిపించేవారు కానీ ఇప్పుడు కేసీఆర్ తరువాత కేటీఆరే అనేలా పరిస్థితులు మారాయి. దేశానికి కేసీఆర్…రాష్ట్రానికి కేటీఆర్ అనేలా బీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా షురూ చేస్తున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మాత్రం కేటీఆర్ సీఎం అవ్వడం మాత్రం ఖాయం.
Also Read : ఆషాడం ముగియగానే అసెంబ్లీ రద్దు – కాంగ్రెస్ ను దెబ్బతీసే లక్ష్యంతో కేసీఆర్..?