తెలంగాణ సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలిచి నిలవాలని భావిస్తున్నారు. చిన్న పొరపాటు జరిగినా కాంగ్రెస్ రూపంలో ప్రమాదం పొంచి ఉందని బీఆర్ఎస్ బాస్ అనుకుంటున్నారు. ఏయే వర్గాలు బీఆర్ఎస్ పై ఆగ్రహంతో ఉన్నాయో గుర్తించిన కేసీఆర్ ఆ వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు హామీలను అమలు చేస్తున్నారు. కొత్త హామీలను తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు తప్ప రైతాంగానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. నిరుద్యోగ యువత ఉద్యోగ నోటిఫికేషన్ల జాడ లేక కేసీఆర్ పై కోపంతో ఉన్నారు.
ఎన్నికల ఇయర్ కావడంతో 2023నుంచి కేసీఆర్ గేర్ మార్చారు. రైతు రుణమాఫీపై నాలుగేళ్ళుగా కాలయాపన చేస్తూ వచ్చిన కేసీఆర్ తాజాగా రైతురుణమాఫీ చేశారు. ఇంకొంతమందికి చేయాల్సి ఉంది. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు విడుదల చేయాలనీ ఆయా శాఖలను ఆదేశిస్తున్నారు. అయితే, ఈసారి ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకోవాలని కసితో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల హామీలను డిక్లరేషన్ ల పేరిట ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా రైతు డిక్లరేషన్ , యువ డిక్లరేషన్ లతో ప్రజల మూడ్ ను మార్చిన కాంగ్రెస్.. ఇప్పుడు దళిత బంధుకు విరుగుడుగా అంబేడ్కర్ అభయ హస్తం పథకం ఎస్సీ, ఎస్టీల ముందు ఉంచింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీలకు రూ.12లక్షల ఆర్థిక సాయం చేస్తామని డిక్లరేషన్ లో పొందుపరిచింది. అయితే దళిత బంధు పంపిణీలో అవినీతికి తోడు బీఆర్ఎస్ కార్యకర్తలకే సాయం అందిందన్న అసంతృప్తి దళిత సామజిక వర్గంలో ఉంది. దానికితోడు కాంగ్రెస్ అంబేడ్కర్ అభయ హస్తం పథకం హామీ దళిత ఓటు బ్యాంక్ ను కాంగ్రెస్ కొల్లగొట్టే అవకాశం ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు.
అందుకే దళిత బంధును రూ.10లక్షల నుంచి రూ.15లక్షల వరకు పెంచే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
అయితే.. ఈ హమీని కేసీఆర్ ఇస్తే ఇదివరకు దళిత బంధు అందుకున్న వారికి మరో ఐదు లక్షల చొప్పున సాయం అందిస్తారా..? లేదంటే కొత్తవారికి మాత్రమే సాయం చేస్తారా..? అన్నది ప్రశ్నగా మారింది. దళితబంధును పెంచితే అప్పుడు బీసీ బంధును కూడా పెంచాలన్న డిమాండ్లు తెరపైకి రావడం ఖాయం. దాంతో కేసీఆర్ ఇప్పుడు అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా..? అన్నది ఆసక్తి రేపుతోంది.
Also Read : కేసీఆర్ సంచలన నిర్ణయం : 34మంది బీఆర్ఎస్ అభ్యర్థులు చేంజ్..?