ఔను.. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇది నిజం. ఇదే నిజం. ఎందుకో తెలుసా? కేసీఆర్ ను ఓడించాలనే కసిని రేవంత్ లో ప్రేరేపించింది మరెవరో కాదు… స్వయంగా కేసీఆరే. కోవర్ట్ ఆపరేషన్ తో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ప్లాన్డ్ గా ఇరికించి కేసీఆర్.. తన ఓటమికి తొలి బీజం వేసుకున్నారు. ఆపై జన్వాడ ఫామ్ హౌజ్ ఘటనలో బెయిల్ రాకుండా అడ్డుకొని, డిటెన్షన్ సెల్లో ఉగ్రవాది తరహాలో బంధించి రేవంత్ ను మరింత రెచ్చగొట్టారు. అప్పటివరకు ప్రభుత్వ విధానాలపైనే కొనసాగుతూ వచ్చిన రేవంత్ రెడ్డి పోరాటం.. ఈ రెండు ఘటనలతో కేసీఆర్ టార్గెట్ గా సాగింది. ఆయనను గద్దె దించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా మారింది.
అది మొదలు..కేసీఆర్ తనపై సంధిస్తున్న అస్త్రాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ..ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చాడు రేవంత్ రెడ్డి. కోవర్ట్ ఆపరేషన్ తో టీడీపీని కకావికలం చేసి, రేవంత్ రెడ్డికి రాజకీయంగా నిలువ నీడ లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తే.. కేసీఆర్ ను ఓడించేందుకు రేవంత్ కాంగ్రెస్ లో చేరారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల అవినీతిని ప్రశ్నిస్తూ.. కొరకరానికి కొయ్యగా తయారయ్యాడు. విద్యుత్ కొనుగోళ్ల స్కాం, కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మన ఊరు – మన బడి వంటి పథకాల్లోని అవినీతిని ఎండగట్టి ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేశాడు. ప్రశ్నించేగొంతుగా ప్రజలు మన్ననలు అందుకున్నాడు. అటు ఉద్యోగ నియామకాలు టీఎస్పీఎస్సీలో అక్రమాలపై అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ యువత, నిరుద్యోగులకు ఆశా దీపంగా కనిపించాడు.
ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని ఉరికే అనలేదు. అప్రతిహతంగా 20ఏళ్లపాటు తెలంగాణను దొరలా పాలించాలని ఆశ పడ్డ కేసీఆర్ .. రేవంత్ విషయంలో కక్ష సాధింపు నిర్ణయాలతో తన గోతి తానే తీసుకున్నారు. తన శత్రువును తానే తయారు చేసుకుని చివరికి ఆ ‘చేతి’లోనే చిత్తుచిత్తుగా ఓడిపోయారు.