గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలకే సర్కార్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇతర నియోజకవర్గాలపై కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని దుయ్యబడుతున్నాయి. ఇదంతా ప్రతిపక్షాల ఆరోపణలే అనుకున్నారు ఇన్నాళ్ళు. కానీ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో సర్కార్ అవలంభిస్తోన్న విధానం చూస్తుంటే…ప్రతిపక్షాలు చేసేవి ఆరోపణలు కావు. నిజమేనని ఈజీగా అర్థం అవుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఈ మూడు నియోజకవర్గాలపై ఒకలా…మిగతా 116నియోజకవర్గాలపై ప్రభుత్వం మరోలా ప్రేమ కనబరుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం లాబియింగ్ చేస్తోన్న ఏ ప్రయత్నాలు వర్కౌట్ కావడం లేదు. సిరిసిల్ల, గజ్వేల్, , సిద్ధిపేట నియోజకవర్గాలకు మాత్రమే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కేసీఆర్ కరుణ చూపిస్తున్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల వైద్యానికి ఆర్ధిక సాయం చేసే విధానం ఉమ్మడి రాష్ట్రం నుంచే కొనసాగుతోంది. ఈ స్కీంకు దరఖాస్తు చేసుకుంటే పేదలు వైద్యం కోసం ఖర్చు చేసిన దాంట్లో 70శాతం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఎలాంటి పైరవీలు లేకుండా ఈ పథకం ద్వారా సాయం పొందేవారు. కొన్ని స్పెషల్ కేసుల విషయంలో మొత్తం ఖర్చులను ప్రభుత్వమే చెల్లించేది. కానీ తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ఎస్ ఈ పథకం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. గత ప్రభుత్వాలు 70శాతం వైద్య ఖర్చులను భరిస్తే బీఆర్ఎస్ సర్కార్ 30శాతం మాత్రమే భరిస్తోంది.
గజ్వేల్ , సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి వచ్చే అప్లికేషన్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆఫీసర్లకు ఆదేశాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సెగ్మెంట్ల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లించిన ఫీజుల్లో 60 నుంచి 70 శాతం పక్కాగా ఇస్తున్నట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి వచ్చే అప్లికేషన్లకు మాత్రం 30శాతానికి మించి ఇవ్వడం లేదు. అది కూడా ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చే దరఖాస్తులు మంత్రులు, ఎమ్మెల్యేలకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తక్కువ మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే.. పార్టీ కోసం ఎలా పని చేస్తారని ఎమ్మెల్యేల భయం. అందుకే ప్రగతి భవన్ కు వెళ్లి లాబియింగ్ చేయాల్సిన దుస్థితి. సొంత పార్టీ కార్యకర్తల కోసం కూడా పైరవీ చేయాల్సిన దుస్థితి నెలకొందని ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి అభిప్రాయం. రాష్ట్రమంతా ఒకే విధానం అమలు చేయడానికి వచ్చే ఇబ్బందులేమిటో తెలియవని సదరు మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులోనూ ఇతర నియోజకవర్గాలపై సర్కార్ వివక్ష చూపుతుండడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తున్నది. ఇదే కొనసాగితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆఫ్ ది రికార్డ్ చర్చించుకుంటుండం కొసమెరుపు.
Also Read : టి. బీజేపీలో బండి సంజయ్ పైసా వసూళ్ల పర్వం..?