గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రాన్ని కేసీఆర్ చీల్చిచెండాడారు. తెలంగాణకు అన్యాయం చేశారని ఉగ్రరూపం ప్రదర్శించారు. ఇంత అన్యాయం ఉంటుందా అంటూ కేంద్రంపై ఊగిపోయారు. కేంద్ర పెద్దల ముందు మోకరిల్లకపోతే ఇంత వివక్ష చూపిస్తారా..?ఇది పద్ధతి కాదు. తీరు మార్చుకోవాలంటూ తన సహజశైలిలో కేంద్రాన్ని ఎండగట్టారు కేసీఆర్.
కేంద్రంపై పోరాటం చేయాలనుకునే చాలామందికి కేసీఆర్ పోరాటపటిమ తెగ నచ్చేసింది. కేంద్రాన్ని వదిలేది లేదని చెప్పడంతో ఆయనను అనుకరించాలని విపక్షాలు అనుకున్నాయి. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా కేంద్రంపై చేస్తోన్న పోరాటంపై వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు కేసీఆర్. బీజేపీ అన్యాయం చేసిన ప్రతిచోట గళం వినిపిస్తామని చెబుతూ వచ్చారు. ఇది కొంతమందిని ఆకర్షించింది. ఇంతలోనే కేంద్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.
తెలంగాణ మంత్రులు బడ్జెట్ పై స్పందించారు. తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందంటూ నోరు విప్పారు. విభజన హామీలను అస్సలు పట్టించుకోలేదని ఎండగట్టారు. కేసీఆర్ కూడా బడ్జెట్ పై మునుపటిలా సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కేంద్రాన్ని దోషిగా చూపిస్తారని భావించారు. కాని ఆయన ప్రగతి భవన్ లోనే సైలెంట్ గా ఉండిపోయారు.
బడ్జెట్ పై కేసీఆర్ ఏమాత్రం ఆవేశ పడలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు సరి కదా.. ఓ పత్రిక ప్రకటన విడుదల చేయలేదు.కేసీఆర్ బుధవారం చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. ఆయనతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జనతా కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఓటు బ్యాంక్ లేదు. అమిత్ జోగి పార్టీ పెట్టినప్పుడు ఆయనకున్న ఇమేజ్ వలన కొంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఆయన చనిపోయిన తరువాత ఆ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారింది. చత్తీస్ ఘడ్ లో పార్టీ ఉండాలంటే కనీసం పేరున్న నేతలు ఉంటె లాభం ఉంటుందనుకొని అమిత్ జోగితో సంప్రదింపులు జరుపుతున్నారు.
కేంద్రంపై పోరాటానికి విపక్ష నేతలతో సంప్రదింపులు జరుపుతున్న కేసీఆర్.. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎందుకు ప్రకటించడం లేదో తెలియాల్సి ఉంది. ఇటీవల ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గవర్నర్ పై పోరు విషయంలో వెనక్కి తగ్గారు. చివరికి క్యాబినెట్ ఆమోదించిన గవర్నర్ స్పీచ్ ను మార్చమంటే మార్చేశారు. కేసీఆర్ ఎందుకిలా స్టాండ్ తీసుకుంటున్నారో తెలియడం లేదు.