కేంద్రంలోనూ బీఆర్ఎస్ ( BRS) చక్రం తిప్పబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR) ప్రకటనలు ఆ పార్టీ ఆ పార్టీ నేతల మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. ఆయన ఏ ధీమాతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పైగా ఇన్నాళ్ళు తమతో జట్టు కడుతాయని ప్రకటించిన పార్టీలు సైతం మేమే కేంద్రంలో కింగ్ మేకర్ లం అవుతామని డైలాగ్ లు పేల్చుతున్నారు.ఇది కేసీఆర్ కు ఇబ్బందికర పరిణామమే అయినా ఆయన మాత్రం ఢిల్లీ పీఠం మాదేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల గురించి పదేపదే పలవరిస్తున్నారు. అధికారంలోకి పార్టీ ఏమేం చేస్తుందో అప్పుడే ప్రకటిస్తున్నారు. పార్టీని జాతీయస్థాయిలో విస్తరించకుండానే ఎర్రకోటపై జెండా ఎగరేస్తామని భారీ, భారీ డైలాగ్ లు కొడుతున్నారు. కేసీఆర్ ప్రకటనలకు భిన్నంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలివైన రాజకీయం చేస్తున్నారు. బీజేపీని గద్దె దించేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకతాటి మీదకు రావాలని పిలుపుస్తున్నారు. అందర్నీ ఒక్కొక్కరిగా కలిసి బీజేపీని ఓడించేందుకు ఏమేం చేయాలో చర్చిస్తున్నారు. త్వరలోనే అఖిలేష్, మమతా బెనర్జీలను కలిసీ యోచనలో ఉన్నారాయన. బీజేపీకి పోటీగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఒకరు ఉండేలా విపక్ష నేతలతో మాట్లాడాలనుకుంటున్నారు.
కానీ కొంతమంది నేతలు ఇంకా బీజేపీ రాజకీయాలు అవగాహనా చేసుకోనట్టున్నారు. తమ నేతృత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మమతా బెనర్జీ(Mamatha Banerjee), అఖిలేష్ యాదవ్ ( Akhilesh Yadav) లు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అఖిలేష్ యాదవ్ త్వరలోనే కేసీఆర్ తో సమావేశం కానున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ మాత్రం తన నేతృత్వంలోనే యాంటీ బీజేపీ ఏర్పడాలని బలంగా ఫిక్స్ అయ్యారు. కానీ ఆయా పార్టీలు కేసీఆర్ నాయకత్వాన్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. గత కొంతకాలంగా మోడీతో డీ అంటే డీ అనేలా రాజకీయ ప్రకటనలు చేస్తోన్న కేసీఆర్ రాజకీయాలు ప్రగతి భవన్ ( Pragathi Bhavan) దాటడం లేదు.
బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయకుండా బీఆర్ఎస్ ఒంటరిగా బలపడే అవకాశం లేదు. ఈ విషయం కేసీఆర్ కు తెలియనిది కాదు. విపక్ష పార్టీలను ఏకం చేసే కార్యచరణ ప్రకటించకుండా ఇతర రాష్ట్రాల్లో వీఆర్ఎస్ తీసుకున్న నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకొని పార్టీ ఇతర రాష్ట్రాల్లో బలపడుతోందని కేసీఆర్ వాపును చూసి బలుపు అనిపించుకునేలా చూసుకుంటున్నారు. నితీష్ రాజకీయాలు మోడీని గద్దె దింపేందుకు ప్రయత్నించేలా ఉన్నాయి కాని కేసీఆర్ రాజకీయాలే ఆ దిశగా సాగడం లేదన్న అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.