టెన్షన్ లో కేసీఆర్ ఫ్యామిలీ.. సేఫ్ జోన్ లో హరీష్.. ఏంటి మేటర్..?
వరుస కేసులతో కేసీఆర్ ఫ్యామిలీ టెన్షన్ పడుతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయింది. కేసీఆర్ అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు భూకబ్జా కేసులో అరెస్ట్ అయ్యారు. సంతోష్ రావుపై కూడా కేసు నమోదైంది. వరుసగా కేసులు నమోదు అవుతుండటం బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని హైరానా పడుతున్నారు.
ప్రభుత్వం విచారణలు కేసీఆర్ , కేటీఆర్ లను సైతం చుట్టే అవకాశం ఉంది. కాళేశ్వరం అక్రమాలపై జ్యుడిషియల్ విచారణ జరుగుతోంది. యాదాద్రి , భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలపై, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై విచారణ జరుగుతోంది. ఈ విచారణ పూర్తయితే బీఆర్ఎస్ కీలక నేతలకు ఇబ్బంది తప్పకపోవచ్చు. విచారణ సంస్థలు కూడా వేగంగా దర్యాప్తు జరుపుతుండటంతో బీఆర్ఎస్ లో ఆందోళన కనిపిస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కేసీఆర్ , కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా విచారణలో చెప్తుండటంతో త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ లలో ఒకరికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపే అవకాశం ఉంది. ఇంతా జరుగుతోన్న మాజీ మంత్రి హరీష్ రావు పేరు మాత్రం బయటకు రావడం లేదు. ఆయన పేరు ఎక్కడా వినిపించడం లేదు. పరేషాన్ లో కేసీఆర్ ఫ్యామిలీ ఉంటే.. ఒక్క హరీష్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్తుండటం గమనార్హం.