ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్న కేసీఆర్ ప్రయత్నం బెడిసికొట్టింది. సిట్ తో బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేసి..కాషాయ పార్టీపై పోరాటంలో తనే నెంబర్1 అనిపించుకోవాలని ఎత్తుగడ వేశారు. కాని ప్లాన్ రివర్స్ అయింది.ఇప్పుడు అదే కేసు కేసీఆర్ మెడకు చుట్టేసుకుంటోంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను దర్యాప్తు సంస్థలకు ఇవ్వకుండా ప్రెస్ మీట్ లో ఎలా బయటపెడుతారని కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అవుతోంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ వెళ్ళడం కేసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే పార్టీ నేతలపై వరుస కేసులు, కూతురు లిక్కర్ స్కాం అంశాలు కేసీఆర్ ను కుదిపెస్తుండగా ఇప్పుడు ఆయనకే సమస్య వచ్చి పడటంతో బీఆర్ఎస్ వర్గాలు కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ నేతలకు న్యాయ సలహాలు అందించేందుకు స్వయంగా రంగంలోకి దిగి ఎలా నడుచుకోవాలో న్యాయ నిపుణులతో చర్చించి కేసీఆర్ సలహాలు, సూచనలు చేశారు. అందుకే ప్రతి రోజూ పైలెట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలుస్తున్నారు. కవిత విషయంలోనూ ప్రత్యేకంగా న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అనేక మలుపులు తిరిగి సీబీఐ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించనుంది. దీంతో కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
సిట్ ను రద్దు చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళే అంశాన్ని కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఈ తీర్పును సవాల్ చేయవచ్చా..? ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అనుకూలమైన తీర్పు వస్తుందా..? రాదా అనే అంశాన్ని లీగల్ ఎక్స్ పర్ట్స్ తో సంప్రదిస్తున్నారు కేసీఆర్.
కేసీఆర్ ప్లాన్ రివర్స్ అయిందా.?
నవంబర్ 3న మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులను కేసీఆర్ రిలీజ్ చేశారు. వాటిని దేశంలోని న్యాయమూర్తులకు, ముఖ్యమంత్రులకు పంపారు. అయితే, ఈ వీడియో టేపులను పబ్లిక్ చేయడంతో కేసీఆర్ ను సీబీఐ విచారించనుంది. ఈ ఆధారాలను ఎవరిచ్చారు..? ఎమ్మెల్యేలే ఇచ్చారా..? లేక పోలీసులు ఇచ్చారా..? వాటిని ఎందుకు పబ్లిక్ చేశారు..? అనే అంశాలపై కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించనుంది.
ఆ కెమెరాలను ఎవరు అమర్చారు..?
పార్టీ మారితే కోట్లు ఆఫర్ ఇస్తామని బీజేపీ ప్రతినిధులుగా పరిచయం చేసుకున్న నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజిలు ఎమ్మెల్యేలు గువ్వల బలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలతో జరిగిన ఆడియో టేపులను కేసీఆర్ రిలీజ్ చేశారు. దాంతో వాటిని ఎవరు రికార్డ్ చేశారు..?రికార్డ్ చేయమని ఎవరు ఆదేశించారు..? రోహిత్ రెడ్డి పోలీసులకు ఎప్పుడు ఫిర్యాదు చేశారు..? ఫామ్ హౌజ్ లో కెమెరాలు ఎవరు అమర్చారు..? ఎప్పుడు పెట్టారు..? అనే విషయాల కోసం సైబరాబాద్ పోలీసులను సీబీఐ ప్రశ్నించనుంది.
ఎమ్మెల్యేలకు నోటిసులు
గువ్వల బలరాజు, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిలను సీబీఐ ప్రశ్నించడం ఖాయమే. అయితే, ఈ కేసును లోతుగా అధ్యయనం చేసేందుకు బీజేపీ ప్రతినిధులైన ముగ్గురు నిందితులు ఎమ్మెల్యేలను ఒకేసారి సంప్రదించారా..? లేక వేర్వేరుగా సంప్రదించారా.? ముందుగా ఎవరికి టచ్ లోకి వచ్చారు..? డబ్బుల ఆఫర్ విషయాన్ని ఎవరు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళారు..? ఆ తరువాత ఏం జరిగిందనే అంశాలను ఎమ్మెల్యేల నుంచి సీబీఐ రాబట్టనుంది.
ప్రగతి భవన్ కు కేసీఆర్
ఫామ్ హౌజ్ లోనున్న కేసీఆర్ హడావిడిగా ప్రగతి భవన్ కు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 30వరకు అక్కడే ఉండాల్సింది. కాని ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పు వివరాలు మధ్యాహ్నం తరువాత బయటకు రావడం..సీబీఐ చేతుల్లోకి కేసు వెళ్లనుండటంతో ఈ కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించేందుకు కేసీఆర్ ప్రగతి భవన్ కు వచ్చినట్లు తెలుస్తోంది.