తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య నేతలతో ప్రగతి భవన్ లో అత్యవసర సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తోపాటు రాజ్యసభ సభ్యుడు రామోదర్ రావులతో సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. ఉదయం 11గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగడం విశేషం.
బుధవారం రోజున ఆదిలాబాద్ జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొనాల్సి ఉండగా.. కేసీఆర్ పిలుపుతో ఆయన హుటహుటినా ప్రగతి భవన్ లో వాలిపోయారు. దాంతో హరీష్ రావు ఆదిలాబాద్ పర్యటన కూడా వాయిదా పడింది. అలాగే, చందనవెల్లిలో వెల్స్పన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే కేటీఆర్ కూడా కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు. ఎందుకింత సడెన్ గా కీలక నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు..? ఈ సమావేశంలో ఏయే అంశాలపై చర్చించారు..? అనేదానిపై సీఎంవో వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు. మంత్రులు కూడా స్పందించలేదు.
అధికారిక పర్యటనలు కూడా క్యాన్సిల్ చేసుకొని హరీష్ రావును ప్రగతి భవన్ కు కేసీఆర్ పిలుపుచుకున్నారంటే ఏదో కీలక సమావేశమే అయి ఉంటుంది. తనకు అత్యంత విశ్వాసంగా ఉండే వారితోనే కేసీఆర్ ఈ భేటీ నిర్వహించారంటే ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై ఏమైనా చర్చించారా..? అనే అనుమానాలు కల్గుతున్నాయి. కర్ణాటకతోపాటు ఎన్నికలకు వెళ్ళాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. ఈ నెలాఖారులోపు అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కీలక నేతలతో కేసీఆర్ హైలెవల్ సమావేశాలు నిర్వహించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.
అదే సమయంలో ఎన్నికల ఇయర్ కావడంతో కీలకమని భావిస్తోన్న పథకాలపై మంత్రులతో చర్చించేందుకు కేసీఆర్ ఈ భేటీ నిర్వహించారని అంటున్నారు. రైతుబీమా, సొంత జాగాల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం, దళితబంధు వంటి వాటిపై చర్చించినట్టు చెబుతున్నారు. కానీ ఈ అంశాలపైనే చర్చించేందుకు అయితే సంబందిత శాఖల మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఎందుకు ఈ భేటీకి పిలవలేదనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ఏదీ ఏమైనా కేసీఆర్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
వరుసగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తూ కేసీఆర్ కొద్ది రోజుల్లోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : సిరిసిల్లలో ఓటర్లు గుర్రు – కూకట్ పల్లి నుంచి కేటీఆర్ పోటీ..?