సర్వేల ఆధారంగా సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వాలా..? లేదా..? అనేది నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ ఆ మధ్య ప్రకటించారు. తాజాగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. సిట్టింగ్ లందరికీ టిక్కెట్లు ఇస్తామని భరోసా కల్పించారు. షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయని..ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ చేసిన ఈ ప్రకటన ఎమ్మెల్యేలకు నమ్మకం కల్గించడం లేదు. ఇందుకు కారణం.. గతంలో కేసీఆర్ , కేటీఆర్ లు చేసిన ప్రకటనలే.
టీఆర్ఎస్ చేయించే సర్వేలో ఎవరి పనితీరు ఉత్తమంగా ఉంటుందో వారికీ టికెట్ ఇస్తామని బలంగా చెప్పారు. కాని ఇప్పుడు మాత్రం సర్వేల ప్రస్తావన లేకుండానే సిట్టింగ్ లందరికీ టికెట్లు కన్ఫాం అంటూ ప్రకటించేశారు. అయితే , కేసీఆర్ తాజా ప్రకటన వలసలను అడ్డుకునేందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కారు ఓవర్ లోడ్ తో ఉంది. కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్ లో చేరిన నేతలూ టికెట్లు ఆశిస్తున్నారు. సిట్టింగ్ లు కూడా టికెట్ మాకంటే మాకేనని చెప్తున్నారు. టికెట్ మరోసారి దక్కదని భావిస్తోన్న కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీ , కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. టికెట్ ఇస్తామనే హామీ ఇస్తే టీఆర్ఎస్ ను వీడెందుకు రెడీగా ఉన్నారని కేసీఆర్ కు సమాచారం ఉంది. అదే సమయంలో పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉండటంతో కలవరపాటుకు గురైన కేసీఆర్…ఎమ్మెల్యేల వలసలను నివారించేందుకు సిట్టింగ్ లకే టికెట్లు అని ప్రకటించారు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్తున్నారు.
కేసీఆర్ చేసిన ప్రకటన సిట్టింగ్ లకు నమ్మశక్యంగా అనిపించకపోయినా…ప్రస్తుతానికి కొంత ఊరటనైతే కల్పిస్తోంది. అదే సమయంలో టికెట్లు ఆశించి టీఆర్ఎస్ లో చేరిన ఆశావహులకు మాత్రం నిరాశ కల్గించేలా ఉంది. దాంతో పలువురు టీఆర్ఎస్ టికెట్ ఆశావహులు ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కునే పనిలో పడ్డారు. అధికారం కాపాడుకోవాలనే ఆతృతతో కేసీఆర్ చేసిన ప్రకటన ఎమ్మెల్యేల వలసలను నివారిస్తుందేమో కాని, కీలక నేతల వలసలను మాత్రం అడ్డుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు చావు దెబ్బ ఎదురు కావడం ఖాయం.