ముందుగా చెప్పింది చేస్తే కల్వకుంట్ల కుటుంబానికి చెందిన వ్యక్తిని ఎలా అవుతానని అనుకుందేమో ఏమో కాని ఎమ్మెల్సీ కవిత మాట మార్చేశారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో సీబీఐ తనకిచ్చిన నోటీసులకు ఆరో తేదీన వివరణ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆరోజు తనకు వీలుపడదని ప్రకటించింది. ఆరో తేదీన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని.. ఆ రోజు బిజీగా ఉంటానని సీబీఐకి కవిత మెయిల్ పంపారు. ఈ నెల 11, 12,14,15 తేదీల్లో హైదరబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. తేదీని ఖరారు చేయాలంటూ సీబీఐని కోరింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి తాను పూర్తిగా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. దర్యాప్తుకు సహకరించడానికి మీకు పంపిన తేదీలలో ఓ రోజు నా వివరణ తీసుకోవచ్చునంటూ లేఖలో ప్రస్తావించారు. తను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని తెలిపారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన రెండు రోజుల్లోనే కవితకు సీబీఐ నోటిసులు పంపింది. దీంతో ఆమె వరుసగా రెండు రోజులపాటు సిఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ లో న్యాయనిపుణులతో సమాలోచనలు జరిపారు. ఆ తరువాతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
సీబీఐ ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కావాలని మొదట సీబీఐకి లేఖ రాశారు కవిత. ఆ రెండు సీబీఐ వెబ్ సైట్ లో పొందుపర్చామని కవితకు సమాధానం వచ్చింది. దాంతో ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ ను చదివిన తరువాత.. అందులో తన పేరు లేదని లేఖలో ప్రస్తావించారు. వెబ్ సైట్ లో సీబీఐ పొందుపరచిన ఎఫ్ఐఆర్ కాపీని పలుమార్లు చదివాను. అందులో తన పేరు లేదు. అంతేకాకుండా నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలోనూ నా పేరు ఎక్కడా లేదంటూ కవిత చెప్పుకొచ్చారు.
ప్రగతి భవన్ లో న్యాయకోవిదులతో సమావేశం తరువాత కవిత ప్రణాళికబద్దంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆరో తేదీన వివరణ ఇస్తానని చెప్పి తరువాత ఆ రోజు కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది.