ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ సంస్థల దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఒకరెనుక ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు. సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తుల్ని సీబీఐ, ఈడీలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అసలు వ్యక్తులను టచ్ చేయడం లేదనే అనుమానాలు కల్గుతున్నాయి. ప్లాన్ ప్రకారమే అసలు వ్యక్తుల అరెస్ట్ ను వాయిదా వేసినట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి.
సౌత్ గ్రూప్ లో దాదాపు అందర్నీ అరెస్ట్ చేశారు. మిగిలింది అరుణ్ రామచంద్ర పిళ్ళై , కల్వకుంట్ల కవిత మాత్రమే. పిళ్ళై ను బినామీగా ఉంచి కవిత లిక్కర్ బిజినెస్ నడిపించారని చార్జీషీట్ లో , రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నాయి దర్యాప్తు సంస్థలు. సౌత్ లాబీలో ప్రేమయమున్న వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు మిగిలింది పిళ్ళై , కవిత మాత్రమే. ఈ లెక్కన దర్యాప్తు సంస్థల నెక్స్ట్ టార్గెట్ వీరే కావొచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అరుణ్ రామచంద్ర పిళ్ళైను ఎప్పుడో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ, సీబీఐ ప్లాన్ మార్చింది. ఆయనను అరెస్ట్ చేయకుండా అలాగే ఉండిపోయింది. మధ్యలో ఆయన అప్రూవర్ గా మారనున్నారని లీకులు కూడా వచ్చాయి. నిజంగానే పిళ్ళై అప్రూవర్ గా మారితే సంచలనాలు నమోదు అవుతాయి. ప్రధానంగా కవిత ఇరుక్కుపోవడం ఖాయమని అంటున్నారు.
ఇప్పటికే ఓసారి కవితను సీబీఐ ప్రశ్నించింది. పిలిచినప్పుడు రావాలని మరోసారి నోటిసులు ఇచ్చారు కానీ, ఇంతవరకు సీబీఐ నుంచి పిలుపు రాలేదు. ఇప్పుడు సౌత్ గ్రూప్ లో మిగిలింది ఇద్దరే కావడంతో త్వరలోనే ఆమెకు సీబీఐ నుంచి పిలుపు రావొచ్చుననే చెబుతున్నారు.
ఈసారి కవిత ఇంటికి సీబీఐ వెళ్ళే అవకాశం లేదని తెలుస్తోంది. ఆమెను విచారణకు పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.