ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆధారాలు లభ్యం కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొమ్మిది ఫోన్లను ధ్వంసం చేశారని,మార్చారని ఈడీ చేస్తోన్న ఆరోపణలను ఆమె తిప్పికొట్టారు. తాను వాడిన ఫోన్లను ధ్వంసం చేయలేదని వాటిని విచారణకు హాజరయ్యే ముందు మీడియాకు చూపించారు. ఇంటి ఎదుట ఓసారి ఈ ఫోన్లను ప్రదర్శించిన కవిత ఈడీ ఆఫీసు ఎదుట కూడా ఫోన్లను చూపించారు. వాస్తవానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై వస్తోన్న ఆరోపణలను ఖండించాలని అనుకున్నారు కవిత. కానీ విచారణకు హాజరయ్యే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం తలనొప్పి అవుతుందని భావించి విచారణ అధికారికి లేఖ రాసి దాన్ని మీడియాకు లీక్ చేశారు.
దర్యాప్తు అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని…ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం ప్రైవసీకి భంగం కలించడం కాదా? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమేనని విచారణ అధికారికి రాసిన లేఖలో కవిత ఆరోపించారు. తప్పుడు లీకులు ఇవ్వడం వలన తన రాజకీయ ప్రత్యర్ధులు ప్రజల్లో తనను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె వివరించే ప్రయత్నం చేశారు.
నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్న విషయాన్ని వదిలేసి టార్గెటెడ్ గా విచారణ చేయడం సరైంది కాదని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈడీ విచారణపై ఆరోపణలు చేస్తూనే తానెం తప్పు చేయడం లేదని వివరించేందుకే ఫోన్లను ఈడీకి అందజేసి.. ఫుల్ కవరేజ్ వచ్చేలా కవిత వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఫోన్లను ధ్వంసం చేసినట్లు ఈడీ లీకులు ఇచ్చిందో లేదో ఎవరికీ తెలియదు. కవిత ఫోన్లను , ఆధారాలను ధ్వంసం చేశారని చార్జీషీట్లలో మాత్రమే పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఈడీ చేసిన ఆరోపణలను కవిత నిజం చేశారు. తొమ్మిది ఫోన్లను మార్చారని స్పష్టమైంది. ఈ ఫోన్లలో ఆధారాలు ఉన్నాయో లేదో కానీ స్వల్ప వ్యవధిలో ఇన్ని ఫోన్లను ఎందుకు మార్చాల్సి వచ్చిందన్న సందేహం అందరిలోనూ వస్తోంది. రహస్యంగా ఏమైనా వ్యాపారాలు చేసే వారు మాత్రమే ఇలా ఫోన్లను మారుస్తుంటారు. కానీ కవితకు ఏ అవసరం వచ్చిందనేది అందరి నోట వినిపిస్తోన్న ప్రశ్న. కారణం ఏదైనా కవిత ఫోన్ల ప్రదర్శన బూమరాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Also Read : కీలకంగా మారిన కవిత ఫోన్..నేడే అరెస్ట్ చేసే అవకాశం..?