ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రెండోసారి ఈడీ విచారణకు వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను పదిగంటలపాటు విచారించారు. ఆమెను 14ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ రెండోసారి విచారణలోనూ కవిత పెద్దగా నోరు విప్పలేదని తెలుస్తోంది. రూ.100కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ ప్రధానంగా కవితను ప్రశ్నించినట్లు సమాచారం. అయితే సోమవారం పదిగంటలపాటు కవితను ఈడీ అధికారులు విచారించడంతో సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ పూర్తైన తరువాతే మరోసారి విచారణ ఉంటుందని అనుకున్నారు. కాని మంగళవారం కూడ విచారణకు రావాలని కవితకు నోటిసులు ఇచ్చింది. దాంతో కేటీఆర్ , హరీష్ రావులు ఢిల్లీలనే మకాం వేశారు.
ఉదయం 11గంటలకు ఈడీ ఆఫీసుకు వెళ్ళాల్సిన కవిత 10 :30కే ఈడీ కార్యాలయానికి వెళ్ళారు. రాత్రి 9గంటల తరువాత ఆమె విచారణను ముగించుకొని బయటకొచ్చారు. విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కలిసి కవితను విచారించారని వార్తలు వచ్చినా అందులో ఎలాంటి నిజం లేనట్టు సమాచారం. కవితను ఈడీ అధికారులు ఒంటరిగానే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. నేడు ముఖాముఖి విచారణ జరిపే అవకాశం ఉంది. సౌత్ గ్రూప్ పై కవితను ఈడీ అధికారులు పలు ప్రశ్నలువేశారని తెలుస్తోంది.‘రామచంద్రన్ పిళ్లై మీకు ఎలా పరిచయం? ఎవరి ద్వారా పరిచయం? సౌత్ గ్రూప్‌లో పెట్టుబడులు ఎలా పెట్టారు? అంత డబ్బు మీకు ఎక్కడిది? ఇలా పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలకు కవిత నుంచి ఎటుంటి సమాధానం రాలేదని సమాచారం.
సాయంత్రం ఏడు గంటలు దాటినా కవిత బయటకు రాకపోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. మరో వైపు కవిత వ్యక్తిగత లాయర్ సోమ భరత్, అడ్వకేట్ జనరల్ గండ్ర మోహన్‌రావు ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లడంతో కవితను అరెస్ట్ చేస్తారేమోన్న ఆందోళన నెలకొంది. వైద్యుల బృందం కూడా లోపలికి వెళ్ళడంతో కవిత అరెస్ట్ అనే వార్తలకు బలం చేకూరింది. కాని ఆఖరికి 9గంటల తరువాత కవిత బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.
విచారణ అనంతరం కవిత కేసీఆర్ ఇంటికి చేరుకోవడంతో అక్కడే ఉన్న కేటీఆర్ ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల గురించి తెలుసుకున్నారు. కవిత వెంటనే కేసీఆర్‌కు ఫోన్ చేశారు. సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడారు. అయితే మంగళవారం ఉదయం 11:30 కు కవితను మళ్ళీ విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. దీంతో గులాబీ నేతల్లో ఆందోళన నెలకొంది.
కవిత ఫోన్ ను ఈడీ సీజ్ చేయడతో అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారని…సౌత్ గ్రూప్ కు సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వాటన్నింటిపై మంగళవారం నాటి విచారణలో కవితను ప్రశ్నించి ఆమె సమాధానాలను తెలుసుకొని అరెస్ట్ కు మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే.. సుప్రీంకోర్టులో 24వ తేదీన హియరింగ్ ఉండటంతో అప్పటి వరకు కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువే. అదే సమయంలో విచారణకు కవిత పెద్దగా సహకరించలేదని ఈడీ భావిస్తే మాత్రం అరెస్ట్ కు మొగ్గు చూపోచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో..