ఢిల్లీ మద్యం కుంభకోణంలో నోటిసులు వచ్చిన వేళ మహిళా రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మహిళా రిజర్వేషన్ల కోసం రాజీ లేని పోరాటం చేస్తానని ప్రకటించిన కవిత… ఇప్పుడు ఆ అంశం గురించి నోరు తెరవడం లేదు సరికదా ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం కవిత ఢిల్లీలో ధర్నా చేస్తామని ప్రకటించినప్పుడే ఆమెపై విమర్శలు వచ్చాయి.
తెలంగాణలో పట్టుమని పదిశాతం కూడా మహిళలకు అవకాశాలు ఇవ్వని కేసీఆర్ ను నిలదీయడం మానేసి కవిత ఢిల్లీలో ఏమొహం పెట్టుకొని ధర్నా చేస్తారనే విమర్శలు వచ్చాయి. 2014కంటే 2018లో మహిళలకు కేసీఆర్ ఇచ్చిన అవకాశాలు మరీ తక్కువ అని, ముందు కవిత ఢిల్లీలో ఆందోళన చేపట్టడం మానేసి తెలంగాణ భవన్ ముందు ధర్నా చేయాలని చురకలు అంటించారు. మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించిన కవిత.. మిస్డ్ కాల్ కార్యక్రమంతోపాటు దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలు, కాలేజ్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.
మే నెల నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లు మద్దతు కోసం పోరుబాట పట్టేలా ప్రణాళిక తయారు చేశారు. దేశంలోని విద్యావేత్తలు, అధ్యాపకులు, బుద్దిజీవులను కలుపుకొని ఉద్యమం నిర్మిస్తామని చెప్పారు. పార్లమెంట్ వెలుపల, లోపల ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఇందుకోసం ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతామని కవిత ప్రకటించారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కవిత ఈ తరహ ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని అప్పట్లో వాదనలు వినిపించాయి కానీ ఆ తరువాత మహిళ రిజర్వేషన్ అంశంపై ఉద్యమం కాదు కదా మాట్లాడటమే మానేసింది.
అప్పట్లో ఈడీ నోటిసులు అందుకున్న కవిత తాను మహిళా రిజర్వేషన్ అంశంపై ఉద్యమం చేపడుతున్నందుకే నోటిసులు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు కవితతోపాటు ఈడీ కూడా సైలెంట్ గానే ఉన్నారు. బహుశ రాజకీయం అంటే ఇదేనేమో. కవితకు ఆపద వస్తే తప్ప మహిళా రిజర్వేషన్ అంశంపై ఆమె మళ్ళీ స్పందించరని విమర్శలు వస్తున్నాయి.
Also Read : బీఆర్ఎస్ పై కవిత సంచలన వ్యాఖ్యలు – కేసీఆర్ పై కోపంతోనేనా..?