కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కసిరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డితోపాటు వంశీచంద్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు సమాచారం. ఈ నెల 29వ తేదీన కసిరెడ్డి ఢిల్లీ వెళ్లి అగ్రనేతల సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్ కోసం కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. పార్టీ నాయకులు కూడా కసిరెడ్డికే ఇవ్వాలని పట్టుబట్టారు. అయినప్పటికీ కేసీఆర్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి కసిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. జైపాల్ యాదవ్ కు సహకరించకుండా జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీ సింగ్ ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిపి గెలిపించుకోవాలని రహస్య భేటీలు కొనసాగించారు. కాని పోటీకి బాలాజీ సింగ్ ఆసక్తి చూపకపోవడంతో కసిరెడ్డి పోటీలో ఉండాలనుకున్నారు.
ఈ నేపథ్యంలో కసిరెడ్డి ఆసక్తిని గమనించిన రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు ఆయనతో చర్చలు జరిపారు. వాస్తవానికి కల్వకుర్తి నుంచి వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ లో పోటీలో ఉండాల్సింది. కాని సర్వేలో ఆయన వెనకబడి ఉండటం..కొంతకాలంగా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుండటంతో కల్వకుర్తి పోటీపై వంశీచంద్ పునరాలోచనలో పడ్డారు. కసిరెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వంశీ స్పష్టం చేయడంతో కసిరెడ్డి కాంగ్రెస్ తరుఫున పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.
రెండు రోజుల్లో కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరికపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
Also Read : బీఆర్ఎస్ లో ఏపూరి సోమన్నకు ఆదిలోనే అవమానం..?