తెలంగాణ సమాజం ఎన్నడూ లేనంతగా గిడసబారి పోతుందేమోనని భయమేస్తుంది. ఏ రకమైన స్పందనలు లేని కాలమొకటి దాపురించింది. ఆకురాలు కాలమంటే భయానక దృశ్యం సాక్షాత్కరించేది, కానీ వెంటనే వసంతం ప్రవేశిస్తుందనే సాంత్వన ఉండేది. ఇపుడు ఏ కాలమైనా దృశ్యం ఒకేలా వ్యక్తం కావటం చూస్తే ఈ సమాజానికి ఏర్పడిన పరిమితి స్పురణలోకి వస్తుంది. ఎదుటి మనిషి స్వేచ్ఛను రక్షించడానికి ప్రాణాన్నే తృణప్రాయంగా ఇచ్చే లెగసిని తెలంగాణ నేల నిదానంగా వదులుకుంటున్నట్లు అన్పిస్తుంది. ‘నీ కాలికి గుచ్చిన ముళ్లును నా పంటితో తీస్తాను’ అనే ప్రాచీన వాక్యం పలికి చోట దారినిండా పల్లేరు కాయలను చల్లి నెత్తురు స్రవిస్తున్నా పరుగెత్తించే సంస్కృతిని తెలంగాణ నేల పునరావృతం చేసుకుంటుంది. చరిత్ర విషాదంగానూ, ప్రహసనంగానూ పునరావృతం కావడమంటే ఇదే కాబోలు. పాలింకి పోవడానికి మందులున్నట్లు మనస్సు ఇంకిపోవడానికి మందులుంటే ఎంత బాగుండునోనని కవయిత్రి ఒక కాలంలో రాసింది. ఈ కాలంలో స్పందనలన్ని ఇంకిపోయినప్పుడు వికసించడానికి ఏ మందును మాత్రం తేగలం. కొందరు సిద్ధాంతాల్లో ఇంకిపోయారు. ఇంకొందరు కులాల్లో ఇమిడిపోయారు. మరికొందరు వ్యక్తీకరణ రూపాల్లో నిద్రపోయారు. ఎవరి గీతలు వాళ్లే గీసుకోండి. ‘మో’ అన్నట్లు ఎవరి తల మీద వారి శవాన్ని బోర్లించుకొని తిరగండి, కానీ శత్రువు వంద ఏనుగుల బలంతో’ స్థైర్య విహారం చేస్తున్న తీరును మర్చిపోకండి. ఆ పదఘట్టనల కింద ఇవ్వాళ నరేశ్, రేపు నీవు, ఎల్లుండి నేను వరుసగా నలిగిపోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.
అసమ్మతిని మౌనంలోకి నెట్టేసిన తెలంగాణ పాలకులే స్వయంగా మేధావులు మౌనంగా ఉన్నారంటే ఏమోలే అనుకున్నాను. పాలకుల గురించి మనం స్పందించవలసిన అవసరం ఏనాడూ లేదు. కానీ పాలితుల మీద జరిగే దాడి విషయంలో కూడా ఉదాసీనంగా ఉంటే ఎలా అర్థం చేసుకోగలం, మేధావులు, మధ్యతరగతి, పౌరసమాజం స్పందించాలంటే ఏమైనా ప్రమాణాలు ఉండాలా? సామాజిక మాధ్యమాలలో కొందరు రాస్తున్నట్లు బైరినరేశ్ బ్రాహ్మణుడు కాకపోవడమే ఈ అస్పందనలకు కారణమా? మన స్పందనలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, సైద్ధాంతిక స్థాయిని బట్టి ఉంటే సమానత్వ భావనకు అర్థముంటుందా? కులము, నాస్తికత్వము, హేతువాదము గురించి పై శ్రేణులు మాట్లాడితే విప్లవకారులు, సంఘసంస్కర్తలు, ఉదాత్తులుగా కీర్తి పొందుతారు. దిగువ శ్రేణులు మాట్లాడితే కులవాదులుగా, సంస్కార హీనులుగా, హీనభాష్యంగా భావించే దృష్టికి ఏ పేరు పెట్టాలి. మనకు రూపం మీద ఉన్నంత ఆపేక్ష, పట్టింపు సారం మీద లేకపోతే మన ఆలోచనలు హేతుబద్ధంగా ఉన్నట్లేనా, బుద్ధిజీవులు ఇప్పుడు కాకపోయినా ఈ ప్రశ్నలన్నింటికి ఎప్పుడో ఒకసారి సమాధానం చెప్పుకోవలసిన అపరాధ భావంలో ఉండిపోవలసి వస్తుంది.
భారతదేశ కులనిర్మాణంలో బైరినరేశ్ శూద్రుడు, చెరబండరాజు రాసినట్లు ‘మా నరాలె దారాలుగా గుడ్డలెన్నో వేసిన’ పద్మశాలి. కులంలో పుట్టాడు. గుడ్డలు నేస్తే తప్ప కూడు దొరకని పేదరికం ఇంకా ఆ కులాన్ని వెంటాడుతుంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య పెట్టుబడిదారుల షాపింగ్ మాల్స్ కాసులవర్షం కురిపిస్తున్న కాలంలో కూడా పద్మశాలీలు దినసరి కూలీలుగా జీవిస్తున్నారు. పోగుల మధ్య అప్పుడప్పుడు జీవితం ఆరిపోతుంది. కళాత్మక నైపుణ్యం ఉన్న ఈ కులాన్ని చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్ పాలకులు ఈర్ష్యతో ముంజేతిని ఖండించారు. అదిగో అలాంటి సవాళ్లను ఎదుర్కొన్న కులంలో పుట్టిన నరేశ్ అక్షరాలను ఒడిసి పట్టుకున్నాడు. అతని తల్లి అన్నపూర్ణమ్మ బీడీలు చుడుతూ బిడ్డను చదివించుకున్నది. తండ్రి ధర్మయ్య దారానికి రంగులను అద్దుతూ నరేశ్కు పంచవర్ణాలను పరిచయం చేసాడు. జీవితాన్ని గెలుపొందడం ఎలాగో గుడ్డను అల్లినంత సహజంగా నేర్పించాడు. 1982లో పుట్టిన నరేశ్ పై ఆ కాల ప్రభావం కూడా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జమ్మికుంట ఈ కాలంలో మధ్యతరగతి చైతన్యానికి ప్రతీకలుగా ఉన్నాయి. విప్లవోద్యమ ప్రభావంతో పాటు సాహిత్య, సాంస్కృతిక వెల్లువలు విద్యార్థి తరాన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ప్రత్యామ్నాయ భావధారకు జమ్మికుంట, హుజురాబాద్ వీటికి ఆనుకొని ఉన్న వరంగల్ ఆలంబనగా నిలిచాయి. విప్లవ చైతన్యం ఇచ్చిన ఊపుతో తొంభైయో దశకం అస్తిత్వ ఉద్యమాలకు జీవంపోసింది. నాస్తిక భావజాలం కూడా ఈ నేపథ్యంలోనే వరంగల్, జమ్మికుంట, హుజూరాబాద్ లలో వ్యాపించింది.
ఇట్లా కాలం పదెనెక్కుతున్న సందర్భంలో బైరినరేశ్ బాల ఆలోచనాపరుడు. చిన్నారి పొన్నారి చిరుత ప్రాయంలో ప్రశ్నను. ఆశ్రయించాడు. అప్పటికే జీడీ సారయ్య భారత నాస్తిక సమాజంతో సంబంధం పెట్టుకొని హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతంలో నాస్తిక ఆలోచనలను ప్రోది చేస్తూ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. పాఠశాలలను, కళాశాలలను కేంద్రంగా చేసుకొని విద్యార్థులలో శాస్త్రీయ దృష్టిని పెంపొందిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థిగా బైరినరేశ్ జీడీ సారయ్య పరిచయంలోకి వచ్చాడు. బాల్యంలోనే హేతు దృష్టి పట్ల ఆసక్తిని పెంచుకొని బాల నాస్తికుడయ్యాడు. సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్లో బైరి నరేశ్ భాగమయ్యాడు. మ్యాజిక్ నేర్చుకొని మంత్రాల పేరుతో జరుగుతుండిన మోసాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసాడు. వ్యక్తిగత కెరియర్ను పక్కకు పెట్టి పూర్తికాలం కార్యకర్తగా మారి నాస్తికత్వాన్ని జీవితంలో భాగం చేసుకున్నాడు. ఆస్తికత్వం అనే భావనకు ప్రత్యామ్నాయ భావన నాస్తికత్వం. ఈ దేశంలో దేవున్ని అంగీకరించే వాళ్లు ఉన్నట్లే నిరాకరించేవాళ్లు కూడా ఉన్నారు. వేల సంవత్సరాలుగా అదొక భావధారగా కొనసాగుతున్నది. కణాదులు, సాంఖ్యాకులు, చార్వాకులు, లోకాయతులు, జాబాలి… ఇలా ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి పదార్థ ఆధారిత సంవాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆధునిక కాలంలో పాశ్యాత్య దేశాలలో జరిగిన అనేక చర్చలు, ప్రయోగాలు ప్రకృతి, సామాజిక శాస్త్రాలలో నూతన సిద్ధాంతాలు ఆవిష్కరణకు నాంది పలికాయి. ఈ ప్రభావంతోటే పెరియార్ రామస్వామి తమిళనాడులో, త్రిపురనేని రామస్వామి, తాపిధర్మారావు తెలుగు నేల మీద హేతువాద భావాలను వ్యాపింపచేసారు. ఈ లెగసినే బైరి నరేష్ అందుకున్నారు.
నరేశ్ కు విద్య మీద ఎనలేని మక్కువ. కనుకనే డజన్ డిగ్రీలు చేసాడు. సమాజంతో సంభాషించడానికి విషయ అవగాహన ఎంత అవసరమో, దానిని చేరవేసే రూపం కూడా అంతే అవసరం. అందుకే వివిధ సామాజిక శాస్త్రాలలో స్నాతకోత్తర డిగ్రీలను పూర్తిచేసాడు. ఇపుడు ప్రభుత్వ పరిపాలన శాస్త్రంలో అత్యున్నత డిగ్రీ(పీహెచ్.డి)ని అందుకోబోతున్నాడు. సైన్స్ను ప్రచారం చేయడం, మ్యాజిక్ శిక్షణను ఇవ్వడం, ఉపన్యాసకళలో తర్ఫీదునివ్వటం తన ఆచరణలో భాగం చేసుకున్నాడు. 1995లో భారత నాస్తిక సమాజంలో చేరి ప్రస్తుతం తెలంగాణ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. నాస్తికత్వాన్ని ప్రచారం చేస్తూ తన జీవితానికి అన్వయం చేసుకున్నాడు. మున్నూరు కాపు కులానికి చెందిన గాండ్ల సుజాతను 2009లో పూజారి ప్రమేయం లేకుండా స్టేజి మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రశ్నోదయ్, జ్ఞానోదయ్ అని పిల్లలకు పేర్లు పెట్టడంలో కూడా తన ప్రాపంచిక దృష్టిని చాటుకున్నారు. పదివేల మందికి పైగా నాస్తికులతో సమన్వయంలో ఉంటూ నిర్మాణాత్మక కృషిచేస్తున్నారు. నల్లచొక్కాలు ధరిస్తూ తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకుంటున్నారు. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసువాళ్లు ఈ సంఘం నిర్మాణంలో ఉండటం ఇవాల్టి సమాజంలో అనుకూల విషయంగా భావించవచ్చు. తెలంగాణలో ఏ గ్రామంలో సభ జరిగినా బైరినరేశ్ తప్పకుండా వక్తగా అనివార్యత ఉంటుందంటే ఆయన నిర్మాణ ప్రభావం ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే ఆయన డిసెంబర్ 19, 2022న కొడంగల్ నియోజకవర్గం రావులపల్లిలో జరిగిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించాడు. ఆయన ప్రసంగంలో వ్యక్తం చేసిన హేతుబద్ద భావాలను వ్యక్తీకరణ సమస్యగా మార్చి కొందరు ఉద్దేశపూర్వకంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఆయన మీద భౌతిక, మానసిక దాడి చేసారు. తప్పుడు కేసులు బనాయించి 48 రోజులు జైలులో నిర్బంధించారు. చట్టం ప్రకారం ఖైదీకి దక్కవలసిన హక్కులను కాలరాసి పనిష్మెంట్ సెల్లో బంధించి వేధించారు. హైకోర్టు జోక్యంతో కొంత ఉపశమనం లభించి బెయిల్ మీద బయటకు రాగల్గినాడు. జైలు నుంచి విడుదలయ్యాక కూడా తన అభిప్రాయాలను దాచుకోకుండా రాజ్యాంగ బద్దంగా మీడియాలో వ్యక్తం చేసాడు. భిన్న స్వరానికి వేదిక లేకుండా పోతున్న శూన్యతను కూడా చర్చలోకి తెచ్చాడు. సమాజంలో ఘనీభవించిన మౌనాన్ని ద్రవింపచేసే ప్రయత్నం మొదలుపెట్టాడు. దీనిని సహించలేని ప్రతీపశక్తులు రెండోసారి. ఆయనను లక్ష్యంగా ఎంచుకొని ఫిబ్రవరి 27, 2023న హన్మకొండలో దాడిచేసారు. పోలీసుల సాక్షిగా వీరంగం చేసి నరేశ్ను తీవ్రంగా గాయపర్చారు. పోలీస్ వాహనంలోకి ఎక్కి దుండగులు దాడిచేసారు. అతన్ని చంపాలనే పథకంతో దాడి జరిగినట్లుగా మనందరికి అర్థమవుతుంది.
జరుగుతున్న క్రమాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అయ్యప్ప జననం గురించి నరేశ్ చేసిన వ్యంగ్య వ్యాఖ్య కారణం కాదు, అదొక సాకు మాత్రమేనని అర్థం అవుతుంది. అయ్యప్ప భక్తులు ఎవరూ కూడా ఇంతటి బీభత్స స్వభావాన్ని కల్గి ఉండరు. 45 రోజులు నిష్టతో అయ్యప్పను కొలిచే భక్తులు ఇంకొకరిని హింసించి ఆనందపడాలని, బాధపెట్టి భయం కలిగించాలని అనుకుంటారని ఎవరూ భావించడం లేదు. నరేశ్ మీద జరిగుతున్న దాడి కొందరి రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది భావజాలాల మధ్య ఘర్షణ. దీనికి ఆలంబనగా రాజకీయార్థిక అంశాలు ఉంటాయి. అయితే మేధో స్థాయిలో జరిగే సంవాదాన్ని చర్చల రూపంగా తలపడే సంస్కృతి స్థానంలోకి బలప్రయోగాన్ని ప్రవేశపెట్టడం ఈ సమాజపు క్షీణ విలువలకు అద్దం పడుతుంది. రానున్న కాలంలో ఎలాంటి ప్రగతి భావనను కల్గి ఉన్నా, వ్యక్తం చేసినా భౌతికంగా తలపడే రోజులు రాబోతున్నాయి. హేతు దృక్పథం కల్గి ఉండటం మీద జరిగుతున్న దాడి వర్తమానంలో చూస్తున్నాం. కానీ గాంధీ గురించి మాట్లాడినా నేరంగా ధ్వనించే కాలంవాకిల్లు తెరుచుకున్నాయి. అంబేద్కర్, రాజ్యాంగం, కులనిర్మూలన, లౌకికత్వం, ప్రజాస్వామ్యం, సమానత్వ భావన గురించిన చర్చలు చేసేవాళ్లు అర్బన్ నక్సలైట్స్, సంఘ విద్రోహ శక్తులుగా, దేశ ద్రోహులుగా చాంతాడంత జాబితా తయారు కాబోతుంది. ఇది బైరి నరేశ్ వైయక్తిక సమస్యగా భావించి మనం మర్యాదస్తులుగా ఉంటే ఏకంగా బుల్డోజర్ మన నివాసాల మీదికి దండయాత్ర చేసి పునాది లేకుండా చేస్తుంది. ఆ తర్వాత మిగిలినవాళ్లు ఎవరైనా ఉంటే శిథిలాల కింద మన మాంసం ముద్దల కోసం వెతుక్కోవలసి వస్తుంది. జర ఆలోచించండి…
ప్రొఫెసర్ .చింతకింది కాశీం
(మార్చి, 2023)