హీరోయిన్ రష్మిక మందనపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించాలని సంచలన నిర్ణయం తీసుకోనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కన్నడ లాంగ్వేజ్, కన్నడ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న చిత్ర పరిశ్రమ షాకింగ్ నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా రష్మిక మందన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ భామకు సౌత్ ఇండస్ట్రీలో విరివిగా అవకాశాలు తలుపు తట్టడంతో అనతికాలంలో అగ్రశ్రేణి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఇకపోతే ఇటీవల రష్మిక చేసిన కామెంట్స్ ఆ కెరీర్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టాలా ఉన్నాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రష్మిక మందన.. తనకు మాతృ భాష కన్నడ మాట్లాడటం కష్టంగా ఉంటుందని…ఇతర భాషలు మాట్లాడటం మాత్రం సులువుగా ఉంటుందని చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. సినిమా అవకాశాల కోసం మాతృ భాషను కించపరిచేలా రష్మిక కామెంట్స్ ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ వివాదం కొనసాగుతుండగానే…కన్నడ సూపర్ హిట్ చిత్రం కాంతారా సినిమాపై రష్మిక వెలువరించిన అభిప్రాయం అక్కడి చిత్ర పరిశ్రమకు ఆగ్రహం తెప్పించింది.
కాంతారా సినిమా ఎలా ఉందని ఆమె అభిప్రాయం కోరగా.. తనకు ఆ సినిమా చూసే తీరిక కూడా లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో హీరో రిషబ్ శెట్టి రష్మిక మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తయని తెలుస్తోంది. మాతృ భాష, కన్నడ సినిమాపై రష్మిక చేసిన వ్యాఖ్యలపై కన్నడ సినీ ఇండస్ట్రీ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నడ ఇండస్ట్రీ నిషేధం విధించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.