ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసింది. ఆరో తేదీన హైదరాబాద్ లోని కవిత నివాసంలో విచారణ జరగనుంది. ఆ తరువాత నెక్స్ట్ ఏంటన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయముందని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఈడీ.. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించింది. ఇప్పుడు సీబీఐ విచారణ జరగనుండటంతో కవిత చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతోంది.
మద్యం పాలసీ వ్యవహారంలో కవితకు భారీగా ముడుపులు అందినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. విషయం తెలిసినా వెంటనే ప్రగతి భవన్ లో కవితను కేసీఆర్ మందలించారని కూడా వార్తలు వచ్చాయి. బీజేపీతో కేసీఆర్ కయ్యానికి సిద్దపడిన వేళ అవినీతి వ్యవహారాల్లో కవిత తలదూర్చడం పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా…విచారణ సంస్థలు కూడా కవిత టార్గెట్ గా విచారణ చేస్తున్నాయని స్వయంగా టీఆర్ఎస్ నేతలే ఆరోపిస్తున్నారు. విషయం మీడియాలో హైలెట్ అయిన సమయంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు, మంత్రులు,ఎమ్మెల్యేలు కవితను కలిసి సంఘీభావం తెలిపారు. సీబీఐ నోటిసులు వచ్చాక మాత్రం టీఆర్ఎస్ నేతలు ఆమెతో దూరం పాటిస్తున్నారు. కేసీఆర్ , కేటీఆర్ లు కూడా మౌనంగా ఉండటం వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ విషయాన్నీ కాంగ్రెస్, బీజేపీలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రోజురోజుకు కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో మరోసారి అధికారంపై టీఆర్ఎస్ కు బెంగ పట్టుకుంది. గతంలోనైతే ఉద్యమ సెంటిమెంట్ , చంద్రబాబు బూచి చూపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కు మరోసారి పవర్ లోకి వచ్చేందుకు బలమైన సెంటిమెంట్ అస్త్రం దొరకడం లేదు. ఇప్పుడు కూతురినే సెంటిమెంట్ అస్త్రంగా మార్చుకోవాలనే వ్యూహంతోనే లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై కేసీఆర్ , కేటీఆర్ లు మౌనం దాలుస్తున్నారనే అభిప్రాయాలు వస్తున్నాయి.
లిక్కర్ స్కామ్ లో రాజకీయ ప్రలోభాలకు, ఒత్తిళ్ళకు లోనుకాకుండా విచారణ సంస్థలు విచారణ జరిపితే కవిత జైలుకు వెళ్ళడం ఖాయమని అంటున్నారు. ఇదే జరిగితే తెలంగాణపై “గుజరాత్ గద్దల” కుట్రలు అనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చి సెంటిమెంట్ ను రాజేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఉండొచ్చునని అంటున్నారు. తద్వారా కేసీఆర్ కుటుంబంపై సానుభూతి పెరగడమే కాదు.. బీజేపీపై వ్యతిరేకతను పెంచే అంశంగా మారుతుందని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందని చెబుతున్నారు.
కేసీఆర్ ఇదే వ్యూహంతో ఉన్నారని అంచనా వేస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. అందుకే కవితను అరెస్ట్ చేయకుండా కేవలం నోటిసులతో సీన్ చేయాలనుకుంటుంది. కల్వకుంట్ల కుటుంబానికి అవినీతిలో వాటా ఉందని చెప్పేందుకు లిక్కర్ స్కామ్ ను వినియోగించుకోనుందని.. ఇందులో భాగంగా కవితకు నోటిసులు ఇచ్చి విషయాన్ని హైలెట్ చేయలనుకుంటుందని చెబుతున్నారు. కవితను కటకటలోకి నెడితే రాజకీయంగా అది బీజేపీకే ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఆ పార్టీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.