”ఈమధ్య పోలిసుల అరాచకాలు మరీ మితిమీరు తున్నాయి. హోటల్లలో వ్యభిచారం చేసుకునే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. కోర్టులు మరీ దారుణం. వ్యభిచారం చేసుకే వాళ్ళకు ఫైన్ వేస్తున్నారు. పవిత్రమైన మన దేశంలో ఒళ్ళు అమ్ముకోవడం కూడా తప్పేనా? ‘ఇల్లు’ అమ్ముకుంటే తప్పు లేదు. మరి ‘ఒళ్ళు’ అమ్ముకుంటే తప్పు ఎలా అవుతుంది? మేము కూడా జిఎస్టి కడుతున్నాము కదా? ఈ అరాచాలకు నేను పుల్ స్టాప్ పెడతాను” అని అనుకుంది ఓ వీరనారి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడకు చెందిన లక్ష్మీ అలియాస్ విజయా అలియాస్ అనురాధా (అసలుపేరు ఎవ్వరికి తెలియదు) కి కొత్త ఆలోచన వచ్చింది. ఒళ్ళు అమ్ముకుని పదిమందిలో పరువు పోగొట్టుకోవడం కంటే గౌరవప్రదంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంది. ద్రౌపతి ఐదుగురిని పెళ్లి చేసుకుంటే లేని తప్పు తాను కూడా చేసుకుంటే ఎలా తప్పవుతుంది? అనుకుంది. పెళ్లి చేసుకుంటే చెడ్డ పేరు రాదు, రైడింగ్ లో దొరకదు. కోర్ట్ లో ఫైన్ కట్టవలసిన అవసరం లేదు. అందుకే కర్ణాటకకు చెందిన శివకుమార్ అనే బ్రోకర్ ని పట్టకుంది. తన ప్లాన్ చెప్పింది.
ఆ ప్లాన్ మేరకు భార్య లేని మధ్య వయస్కులను అతను గాలం వేసి పడతాడు. తనకు రూ. 2 నంచి 6 లక్షలు ఇస్తే తన చెల్లి లక్ష్మీతో పెళ్లి చేస్తానని నమ్మబలుకుతాడు. ఆ పెళ్ళికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదని, పెద్దలు రారని చెప్పి ఓ గుడిలో గుట్టుగా పెళ్లి చేస్తాడు.
ఆమె ఆరు నెలలు ఏంతో ప్రేమతో ఉంటూ ఆ భర్త ఆస్తి పాస్తులు తీసుకుంటుంది. బ్యాంకు డబ్బుతో నగలు కొంటుంది. ఇక అతని దగ్గగా ఏమి మిగలలేదు అని నిర్ధారించుకున్నాకా గొడవ చేస్తుంది. ఇక నీతో సంసారం చేసే ప్రసక్తి లేదని చెప్పాపెట్టకుండా జెండా ఎత్తేస్తుంది. ఈ లోగా శివకుమార్ మరో బకరను చూసి అందినంత డబ్బు లారి మరోసారి పెళ్లి చేస్తాడు. ఆరు నెల్ల తర్వాత మళ్ళి ఇదే తంతు.
నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, తాటిపెల్లికి చెందిన లక్ష్మణ్ భార్య ఎప్పుడో చనిపోయింది. ఎప్పటిలా శివకుమార్ అతనిని కలిసి తన చెల్లి విజయతో పెళ్లి చేయిస్తానని రూ. ౩ లక్షలు తీసుకుని రహస్యంగా పెళ్లి జరిపించాడు. ఎప్పటిలా ఆమె అతనితో కాపురం చేసి అందినంత దోచుకుని ఎనిమి నెలల తర్వాత జెండా ఎత్తేసింది.
శివ కుమార్ మహబూబ్ నగర్ కి చెందిన మరో వ్యక్తితో పెళ్లి జరిపిస్తుంటే లక్ష్మణ్ పట్టుకుని పోలీసులకు పట్టించాడు. తీగ లాగితే దొంక కదిలింది. ఈ నిత్య పెళ్లి కూతురు ఇప్పటివరకు చేసుకున్న పెళ్లిల లిస్టు చూసి పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. తోడే కొద్ది కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ద్రౌపతి నాడు ఐదుగురిని పెళ్లి చేసుకుంటే ఈ కలియుగ ద్రౌపతి చేసుకున్న పెళ్ళిలకు అంతేలేదు.
౦౦౦