బీఆర్ఎస్ అధిష్టానంపైనే తీవ్ర విమర్శలు గుప్పించి హైకమాండ్ ఆగ్రహానికి గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జూపల్లి కృష్ణారావులు ఏ పార్టీలో చేరనున్నారు..? ఈ ఇద్దరి నేతలను చేర్చుకోవాలని పోటాపోటీగా ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్, బీజేపీలలో ఈ ఇద్దరి నేతల ఓటు ఎవరికీ పడనుంది..? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో ఈ ఇద్దరి నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డిబేట్ గా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. దాంతో ఈ ఇద్దరు నేతల పొలిటికల్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. పొంగులేటిని చేర్చుకోవాలని బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది కాని ఆయన మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఏమాత్రం బలం లేని బీజేపీలో చేరడం అమాయకత్వం అవుతుందనే ఆలోచనతో పొంగులేటి ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా కొట్టినా తన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని పొంగులేటి ఆలోచిస్తున్నారు. ఎన్నికలకు మరెంతో సమయం కూడా లేదు. ఈ తక్కువ సమయంలో బీజేపీని జిల్లా రాజకీయాల్లో బలీయమైన శక్తిగా మార్చడమంటే ఆషామాషీ కాదని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరితేనే బెటర్ అనే తలంపుతో పొంగులేటి ఉన్నారని.. కాంగ్రెస్ లో చేరాలనే పొంగులేటి సూత్రాప్రాయ నిర్ణయానికి ఆయన అనుచరులు కూడా జైకొట్టారని తెలుస్తోంది.
బీఆర్ఎస్ ను ధిక్కరించి కాంగ్రెస్ లో చేరితే తనను ఆర్థికంగా దెబ్బకొట్టాలని బీఆర్ఎస్ పెద్దలు ప్రయత్నించే అవకాశం ఉందని పొంగులేటి మరో కోణంలో కూడా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా కేసులను ఎదుర్కోవడం ఇబ్బంది అవుతుందని…బీజేపీలో చేరడమే రైట్ ఛాయిస్ అని మరో ఆలోచన కూడా పొంగులేటి చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈటల లాంటి నేతలనే అక్రమ కేసులతో వేధించాలని చూశారు కాబట్టి తనను కూడా ఆర్థికంగా ఇబ్బందిపాలు చేసేందుకు సర్కార్ వెనుకంజ వేయదని పొంగులేటి పరిపరివిదాలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా జాతీయ పార్టీలో చేరుతానని స్పష్టం చేసిన పొంగులేటి ఈ నెలఖారులో తన నిర్ణయాన్ని వెలువరిస్తానని ప్రకటించడంతో మరికొద్ది రోజుల్లోనే ఆయన ఏ పార్టీలో చేరుతారనేది క్లారిటీ రానుంది.
జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్ధి అయిన డీకే అరుణ బీజేపీలో కీలక పదవిలో కొనసాగుతుండటంతో జూపల్లి ఇప్పుడు ఆ పార్టీలో చేరితే తనకు పదవులు దక్కుండా డీకే అరుణ ఆమెకు ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలతో అడ్డు పడుతుందని.. అందుకే కాంగ్రెస్సే తనకు కరెక్ట్ అనే నిర్ణయానికి జూపల్లి వచ్చారని తెలుస్తోంది. ఆ మధ్య ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన సమయంలోనూ జూపల్లి అనుచరులంతా కాంగ్రెస్ లో చేరాలని విన్నవించారు.త్వరలోనే కొల్లాపూర్ లో తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్ళాలనే విషయంలో జూపల్లి తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఆదివారం కొత్తగూడెంలో కేసీఆర్ పై విరుచుకుపడిన వెంటనే జూపల్లితో రేవంత్ టచ్ లోకి వెళ్ళారని కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తె ఈ ఇద్దరు నేతలు సొంత గూటికి తిరిగి చేరే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. చూడాలి మరి ఢిల్లీ బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి వారిని కన్విన్స్ చేస్తారేమో..!