మూడు, నాలుగు రోజుల్లో ఏ పార్టీలో చేరుతామనే విషయంలో క్లారిటీ ఇస్తామన్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో కలిసి టి.పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీమంత్రి జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలని రేవంత్ వారిద్దరిని ఆహ్వానించారు.
రేవంత్ తో భేటీ ముగిసిన తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవిష్యత్ కోసమే అందరం ఏకం అవుతున్నామని ప్రకటించిన ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు హింట్ ఇచ్చేశారు. గత కొన్ని రోజులుగా అన్ని వర్గాలతో చర్చలు జరిపామని మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
డైలీ సీరియల్ ను తలపిస్తున్న పొంగులేటి ఎపిసోడ్ కు మూడు నాలుగు రోజుల్లో తెరదించనున్నట్లు ప్రకటించారు. జూపల్లితో కలిసి తెలంగాణ అంతటా పర్యటనలు చేపడుతామని పొంగులేటి చెప్పారు. వీరి పర్యటనలకు పార్టీ నుంచి ఆమోదముద్ర లభిస్తుందో లేదో చూడాలి. తెలంగాణలో అమరుల ఆకాంక్షలు సాకారం కాలేదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.