పెళ్లికాని ప్రసాద్ లకు ఊరట కల్గించేలా కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రైతుల కుమారులను పెళ్ళాడిన యువతులకు తమ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. రైతుల కుమారులను పెళ్లి చేసుకునేందుకు యువతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విషయం తన దృష్టికి వచ్చిందని…ఈ సమస్య నుంచి ఉపశమనం కల్గించెందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేడీఎస్ అధినేత కుమారస్వామి వెల్లడించారు.
కోలార్ లోని పంచరత్నలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కుమారస్వామి మాట్లాడుతూ పెళ్లి కాని ప్రసాద్ ల సమస్యలను తీర్చే హామీని ప్రకటించారు. కొత్తగా ఎవరూ చేయని ఆలోచన తాము చేస్తున్నామని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీ అమలుపై దృష్టి పెడుతామని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడినట్టు అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ హామీని ప్రకటిస్తున్నామని వెల్లడించారు.
పేదరికాల్లో మగ్గిపోతున్న రైతులు తమ కొడుకులకు పెళ్ళిళ్ళు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారని…ఇందుకు సంబంధించి తనకో వ్యక్తి పిటిషన్ ఇచ్చారని తెలిపారు కుమారస్వామి. ఎన్నికల్లో గెలిచేందుకు ఎవరిని ప్రధానంగా దగ్గరికో తీసుకోవాలనే దానిపై సమాలోచనలు జరిపిన కుమారస్వామి…పెళ్లి కాని రైతు కుమారులను పెళ్ళాడే యువతులకు రెండో లక్షల ఇస్తామనే హామీని ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఆ మధ్య ఫిబ్రవరిలో మాండ్యాకు చెందిన సుమారు 200 మంది పెళ్లికాని యువకులు పాదయత్రగా చామరాజనగర్ జిల్లాలోని మహాదేశ్వర ఆలయానికి వెళ్లారు. ఇలా చేస్తేనైనా దేవుడు తమ మొరను ఆలకించి పెళ్ళిళ్ళు జరిగేలా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఇలా చేశారు. దీంతో కర్ణాటకలో రైతుల కొడుకులు వారి పేదరికం కారణంగా పెళ్లిళ్లకు కూడా నోచుకోలేకపోతున్నారాని గ్రహించిన కుమారస్వామి దీనిని కూడా సమస్యగా భావించి రెండు లక్షల నజరానా హామీని ఇచ్చారు.