తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తరుఫున ఏపీ సీఎం జగన్ రంగంలోకి దిగారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఢిల్లీ వరుస పర్యటనలో తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చాలని జగన్ కేంద్ర పెద్దలను కోరడం వెనక కేసీఆర్ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకున్నారు. ఇందులో భాగంగా సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కీలకమైన స్థానాల్లో అధికారులను బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేసే వారిని నియమించుకున్నారు. ఎన్నికలకు కావాల్సిన సరంజామాను కూడా రెడీ చేసుకున్నారు. అయితే , బీఆర్ఎస్ – బీజేపీల మధ్య తలెత్తిన రాజకీయ సంఘర్షణతో రెండు పార్టీల మధ్య పూడ్చాలేనంత గ్యాప్ వచ్చింది.
ఆ మధ్య ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు కేసీఆర్ ప్రయత్నించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ పరిస్థితుల నడుమ ముందస్తుకు వెళ్తే కేంద్రం సహకరించే పరిస్థితి లేదని కేసీఆర్ కు అర్థమైంది. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దామనుకుంటే కేంద్రం రాష్ట్రపతి పాలన విధించి బీఆర్ఎస్ ను అష్టదిగ్బంధనం చేస్తుందని కేసీఆర్ కు తెలుసు. వీటన్నింటిని పసిగట్టిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా జగన్ తో కలిసి రాజకీయం చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. 2019లో జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ కు బీఆర్ఎస్ సహకరించగా ఇప్పుడు జగన్ ను తనకు సహకరించాలని కేసీఆర్ కోరినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
జగన్ కూడా ఏపీలో ముందస్తు ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఇందుకోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో జగన్ ఇటీవల వరుసగా భేటీ అవుతున్నారు. జగన్ ఇంతలా ముందస్తుకు ముచ్చట పడటం… కేంద్ర పెద్దల సహకారం పదేపదే కోరడం వెనక కేసీఆర్ ఉన్నారన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఏపీలో ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరించిన పక్షంలో కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళొచ్చు అనేది ఆయన ప్లాన్. ఎందుకంటే… ఏపీలో జరిగే ముందస్తు ఎన్నికలకు కేంద్రం సహకరించి తెలంగాణలో సహకరించకుండా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేదు. అందుకే ముందస్తు విషయంలో జగన్ కేంద్ర పెద్దలను పదేపదే కలవడం వెనక కేసీఆర్ రాజకీయ ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నాయని అంటున్నారు.
Also Read : ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ – కొడాలి సహా మరో ముగ్గురికి బెర్త్ కన్ఫామ్..!?