తెలంగాణలో ఐటీ, ఈడీ వరుస దాడులతో అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎప్పుడు ఎవరు టార్గెట్ అవుతారోనని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన కొట్టోచ్చినట్లు కనిపిస్తోంది. ఐటీ, ఈడీ దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సీఎం కేసీఆర్ ధైర్యం చెబుతున్నా కొంతమంది నేతల్లో మాత్రం బెంగ తొలగడం లేదు.
ఐటీ, ఈడీల రాడార్ లో ఉన్నారని పార్టీకి చెందిన కీలక నేతలను కేసీఆర్ హెచ్చరించారు. ఏ క్షణమైనా దాడులు జరిగొచ్చునని అప్రమత్తం చేస్తున్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ నేతలు పలు అవకతకలకు పాల్పడినట్లు సమాచారం సేకరించి పెట్టుకున్న దర్యాప్తు బృందాలు దాడులతో వారిని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఏర్పరుచుకున్న వ్యవస్థపై యాభై బృందాలతో దాడులు చేశాయి. స్పష్టమైన సమాచారం తెలియరాలేదు కాని, వందల కోట్ల అవకతవకలు బయట పడే అవకాశం ఉందన్న గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.
మల్లారెడ్డి చేసే వ్యాపారాలన్నీ పెద్దవే. ఆయనకు చెందిన మెడికల్ కాలేజ్ లో ఒక్కో సీట్ కోసం కోట్లలో వసూళ్లు చేస్తారని ప్రచారం ఉంది. ఇలా కోట్లలో వ్యాపారం చేసేవారు టీఆర్ఎస్ లో చాలామందే ఉన్నారు. వారంతా అధికార పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించే వారే. బీజేపీ శతృత్వాన్ని కొనితెచ్చుకున్నారు కేసీఆర్. అదే తమ మెడకు చుట్టుకుందని ఆ పార్టీ నేతలు కలవరపాటుకు గురి అవుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు నోటిసులు ఇవ్వడాన్ని బీజేపీ అగ్రనేతలు సీరియస్ గా పరిగణిస్తున్నారు. దర్యాప్తు సంస్థలతో పోరాటం చేయడానికి సిద్దమైతే..మేము కూడా రెడీ అన్నట్లు బీజేపీ వ్యవహారశైలి కనిపిస్తోంది. ముందు, ముందు టీఆర్ఎస్ నేతలపై మరింత ఎక్కువగా దర్యాప్తు సంస్థలు దాడులు చేసే అవకాశం కనిపిస్తోంది.